ఎం.హెచ్ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మోటూరు హనుమంత రావు...పీడిత, తాడిత ప్రజల కోసం తన కలాన్ని, గళాన్ని, యావజ్జీవితాన్ని అర్పించిన మంచి కమ్యూనిస్టు, గొప్ప మానవతావాది. కామ్రేడ్ ఎం.హెచ్ భౌతికంగా మనల్ని వీడి రెండు పదులు దాటినా, ఆయన నెలకొల్పిన విలువలు, ప్రమాణాలు, ఆచరణ రాబోయే తరాలకు ఎంతైనా ఆదర్శప్రాయం, అనుసరణీయం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. 80, 90 దశకాలలో ప్రజాశక్తిలో చేరినటువంటి నాలాంటి వారికెందరికో గురుతుల్యులు. ఆప్యాయత, అనురాగం, సౌశీల్యం మూర్తీభవించిన వ్యక్తి. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తూ ఆ ఆప్యాయత, అభిమానాలను చూరగొనే అవకాశం లభించింది. ఆ జ్ఞాపకాలు, అనుభవాలు ఎప్పటికీ మరచిపోలేనివి.
1989లో ప్రజాశక్తిలో నేను చేరడానికి ముందు విశాఖలో ఆయనను కలుసుకోవడం జరిగింది. నా చదువు పూర్తయిన తరువాత ఏం చేయాలి అనుకుంటున్న తరుణంలో 'ప్రజాశక్తి పత్రికలో పనిచేస్తావా?' అంటూ ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ సహచరుడు, మిత్రుడి నుంచి ఓ ఉత్తరం అందింది. అందుకు 'సరే' అన్నాను. జనవరి 26న పార్టీ త్రివేండ్రం మహాసభ తీర్మానాల గురించి వివరించేందుకు ఎం.హెచ్ విశాఖ వస్తున్నారు. ఆయనను ఒక్కసారి కలవమని మిత్రుడు చేసిన సూచన మేరకు వెళ్లి కలిశాను. 'ఏం చదువుకున్నావు?' అని అడిగారు. నా డిగ్రీలు గురించి చెప్పాక... 'బి.ఇడి చేశానంటున్నావు. రేపు టీచర్ ఉద్యోగం వస్తే వెళ్లిపోతావు. అప్పుడు నీకు తర్ఫీదు నిచ్చి, నీ కోసం వెచ్చించిన శ్రమ అంతా వృథానే కదా!' అని అడిగారు. 'లేదు, ప్రజాశక్తి లోనే ఉంటా'నని చెప్పాను. 'తొందరేమీ లేదు. ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓకే అనుకుంటే, నేరుగా విజయవాడలో ప్రజాశక్తి కార్యాలయానికి వచ్చేరు' అని చెప్పారు. ఆ ప్రకారమే కుటుంబ సభ్యులకు విషయం చెప్పి చిన్న సూట్‌కేసులో బట్టలు సర్దుకుని విజయవాడ వచ్చాను. ఎడిటోరియల్ బోర్డులో జనరల్ డెస్కు, మొఫసిల్ డెస్కు రెండే ఉండేవి. జర్నలిజంలో ఇప్పటిలా ప్రత్యేక శిక్షణ ఏమీ ఉండేది కాదు. ఎవరైనా పనిచేయడం ద్వారా వృత్తిలో మెళకువలను నేర్చుకోవాల్సిందే. అప్పట్లో మొఫసిల్ డెస్కులో ఉద్యమ వార్తలను కంపైల్ చేసేటప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన తుళ్లూరును కృష్టా జిల్లాలో పేర్కొనడం జరిగింది. ఇది అవగాహనా రాహిత్యం వల్ల జరిగిన పొరపాటు. దీనిపై వెంటనే గుంటూరు జిల్లా పార్టీ బాధ్యులు ఫోన్ చేసి 'తుళ్లూరు ఎక్కడ ఉందో కూడా తెలియదా?' అంటూ ఒకింత కటువుగానే మాట్లాడారు. ఆ తరువాత ఎడిటర్ గారి దృష్టికి ఈ విషయం వెళ్లింది. ఆయన పిలిచారు. ఏమంటారోనని భయం భయంగానే వెళ్లా. 'గడ్డెన్నా! ప్రదేశాలు, వ్యక్తుల పేర్లు, హోదాలు రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి....' అంటూ నా తప్పును చాలా సున్నితంగా ఎత్తి చూపారు. అంతకు ముందు వచ్చిన ఫోన్‌కాల్‌తో చెదిరిన నా మనసు ఆయన మాటలు ఎంతో ఊరటనిచ్చాయి. ఈ తప్పు జరగకుండా నివారించలేకపోయానే అన్న పశ్చాత్తాపం నాలో కలిగింది. సిబ్బంది తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దేందుకు ఎంతో ఓపికగా యత్నించేవారు. స్వీయ క్రమశిక్షణ, కష్టించి పని చేసే తత్వాన్ని సిబ్బందికి అలవర్చడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. సుందరయ్యనగర్ నుంచి సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేటప్పుడు గేటు దగ్గర నిల్చొని నవ్వుతూ పలకరించేవారు. పాత తరం కమ్యూనిస్టులు, పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎవరు వచ్చినా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారికి సమయం ఇచ్చేవారు. వారిని గేటు దాకా వచ్చి రిక్షా ఎక్కించి సాగనంపేవారు.
కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికల ప్రభావం పత్రికపై కూడా పడింది. పాత తరానికి కొత్త తరానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. పాత తరం తగ్గిపోతున్నది. ఆ బాధ్యతను అందుకోవడానికి కొత్త తరం తగినంతగా రావడం లేదు. ఆ పరిస్థితుల్లో విద్యార్థి ఉద్యమం నుంచి ఒక తరంగం వచ్చింది. వారిని రాజకీయంగా చైతన్య పరుస్తూ, వృత్తిపరమైన మెళకువలు నేర్పుతూ ఆ గ్యాప్‌ను పూడ్చడంలో ఎం.హెచ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రజాశక్తి ఆర్థికంగా తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొన్నప్పుడు సిబ్బంది జనరల్ బాడీ సమావేశం వేసి పరిస్థితిని వివరించి, పత్రికను నిలబెట్టాల్సిన ప్రాధాన్యత గురించి నొక్కి చెప్పారు. పత్రికను ఆదుకునేందుకు ఆనాడు సుందరయ్య గారి ప్రేరణతో తమ ఆస్తులను అమ్మి ఇచ్చిన డివి సుబ్బారావు వంటి త్యాగమయులను ఆయన గుర్తు చేశారు. ఆ వివరణతో కష్ట కాలంలో పత్రికను నిలబెట్టేందుకు వేతనాలను కొంత తగ్గించుకునేందుకు సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సిబ్బందిని విశ్వాసంలోకి తీసుకోవడం, వారిలో సామాజిక, రాజకీయ చైతన్యం తీసుకువచ్చేందుకు ఎం.హెచ్ నిరంతరం ప్రయత్నించేవారు. మరో వైపు ఆయన రచనా వ్యాసంగం ఒక ప్రవాహంలా సాగిపోయేది. అమెరికా సామ్రాజ్యవాదం పైన ఆయన కలం నిప్పులు చెరిగేది. సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు సోషలిజం అజేయమంటూ ఆయన రాసిన వ్యాసాలు, సందేహాలు-సమాధానాలు వంటి శీర్షికలు వామపక్ష శ్రేణులను అమితంగా ఆకట్టుకునేవి. రాజ్యసభ సభ్యుడిగా, రాజకీయ సంపాదకుడిగా, ఉద్యమకారుడిగా అన్నింటా ఆయనది అందెవేసిన చేయి. పత్రికకు మార్గదర్శిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.
ప్రజాశక్తికి మార్గదర్శకులు, స్పూర్తి ప్రదాతలుగా నిలిచిన ఎం.హెచ్, బొమ్మారెడ్డి ని ఈ సందర్భంగా స్మరించుకోవడం ఎంతైనా సముచితం. వారు చూపిన విలువలను, నెలకొల్పిన ఉన్నత సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి అర్పించే నిజమైన నివాళి.
ఆదర్శ పాత్రికేయుడు బొమ్మారెడ్డి

కమ్యూనిస్టు పత్రికలతో సుదీర్ఘ అనుబంధం కలిగిన పాత్రికేయడు వి.ఆర్ బొమ్మారెడ్డి. ఎం.హెచ్ గారికి అన్నిటా చేదోడు వాదోడుగా వుంటూ ప్రజాశక్తిని ముందుకు నడిపించడంలో బొమ్మారెడ్డి నిర్వహించిన పాత్ర నిరుపమానమైనది. ప్రజాశక్తికి పర్యాయపదంగా మారిన బొమ్మారెడ్డి పత్రికా నిర్వహణ, సిబ్బంది బాగోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చినా ఆయన చాలా సింపుల్‌గా వుండేవారు. తెల్లటి ఖద్దరు చొక్కా, పంచె కట్టుకుని చేతిలో లెదర్ బ్యాగ్ పట్టుకుని ఠంచనుగా ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వచ్చేవారు. సాయంత్రం 5 గంటలకు ఈవెనింగ్ ఎడిషన్ ముగియగానే బ్యాగ్ చేతి పట్టుకుని నడచుకుంటూ ఇంటికి వెళ్లేవారు. ముఖ్యమైన సందర్భాల్లో ఎం.హెచ్ గారు సంపాదకీయాలు రాసేవారు. మిగతా రోజుల్లో బొమ్మారెడ్డి గారే ఆ బాధ్యత చూసేవారు. పుస్తకాలను అనువదించడం ఆయన దైనందిన చర్యల్లో ఒకటిగా ఉండేది. సిబ్బందిని వెన్నుతట్టి ప్రోత్సహించడంలో బొమ్మారెడ్డి గారు ముందుండేవారు. ఒకసారి శ్రీశ్రీ జయంతి సందర్భంగా పత్రికలో నేను వ్యాసం రాయగా, ఢిల్లీలో ఉన్న మాకినేని బసవపున్నయ్య గారు ఆ వ్యాసంపై తన స్పందనను తెలియజేస్తూ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం బొమ్మారెడ్డి గారు చదివి 'చూశావా...నీ వ్యాసానికి ఎంతటి స్పందన వచ్చిందో...' అన్నారు. నిజానికి ఆ వ్యాసంలో 'మరో ప్రపంచం మరో ప్రపంచం' కవిత గురించి ప్రస్తావించకపోవడం ఒక లోపంగా ఎం.బి ఎత్తి చూపారు. ఆ విమర్శను చూపి నీ వ్యాసం బాగులేదయ్యా అని అనవచ్చు. కానీ, కొత్త కామ్రేడ్‌ను ప్రోత్సహించాలి అన్న దృష్టితో పాజిటివ్‌గా చూపే ప్రయత్నం చేశారు. ప్రజాశక్తి సిబ్బందిని ఆయన ఒక కుటుంబంగా భావించేవారు. నాతో సహా చాలా మంది కులాంతర వివాహాలకు ఆయనే పౌరోహిత్యం వహించారు. తన చేతుల మీదుగా పెళ్లి చేసిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని, వారితో ప్రత్యేకంగా గ్రూప్ ఫొటో దిగడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. ప్రజాశక్తి ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌కు 1999లో తరలివెళ్లాక కూడా సిబ్బంది యోగ క్షేమాల గురించి అడిగితెలుసుకునేవారు. హైదరాబాద్ వస్తే ప్రజాశక్తి సిబ్బందిని తప్పనిసరిగా కలిసేవారు. ప్రజాశక్తి పత్రిక పట్ల, పత్రికా సిబ్బంది పట్ల ఆయనకు ఉన్న మక్కువను తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.
కె. గడ్డెన్న










