Feb 09,2023 23:27

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ (విజయవాడ) 

విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో గురువారం పుస్తక మహోత్సవ్‌ ప్రారంభమైంది. పుస్తక ప్రియులు ఎప్పుడు పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతుందా అని ఎదురుచూశారు. ప్రతి ఏడాది జనవరిలో జరిగే ఈ పుస్తక మహోత్సవం ఈసారి ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. అంతేగాక పుస్తక ప్రదర్శన ప్రతి ఏటా జరిగే ప్రాంగణంలో కాకుండా ఈసారి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటుచేశారు. సుమారు 120 ప్రచురణ సంస్థలు 250కిపైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ భిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్వతి, అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
మధురాంతకం రాజారాం కథల పుస్తకాల ఆవిష్కరణ
పుస్తక మహోత్సవ్‌ ప్రాంగణంలోని సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా మధురాంతకం రాజారాం కథల పుస్తకాల సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని సిసిఎల్‌ఎ కార్యదర్శి ఇంతియాజ్‌ అహ్మద్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చక్కని కథలు అందించడంలో, అందరికీ అర్థమయ్యే రీతిలో మధురాంతరం రాజారాం కథలు ఉంటాయన్నారు. ఈకార్యక్రమంలో పద్మభూషన్‌ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర, పుస్తక మహోత్సవ్‌ నిర్వాహకులు విజయకుమార్‌ పాల్గొన్నారు.
చిన్నారులకు పోటీలు
పుస్తక మహోత్సవ్‌లోని ప్రతిభా వేదికపై చిన్నారులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. పుస్తక మహోత్సవం జరిగే అన్ని రోజూలు ప్రతిభా వేదికపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా గురువారం పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రజాశక్తి చీఫ్‌ జనరల్‌ మేనేజరు వై.అచ్యుతరావు సర్టిఫికెట్లను అందచేశారు. ఈకార్యక్రమంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మనోహర్‌ నాయుడు, కె.లక్ష్మయ్య, రామరాజు తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన పలు సైన్స్‌ విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెవివి నాయకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.