నివాళులర్పిస్తున్న ఎస్‌పి డాక్టర్ తిరుమలేశ్వర్‌రెడ్డి
ప్రజాసేవకులు టంగుటూరి ప్రకాశం పంతులు
ప్రజాశక్తి-నెల్లూరు:ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధుడు, దేశభక్తుడు, మేధావి, ప్రజాసేవకుడు, ధీరుడు, కార్యదక్షుడని ఎస్‌పి డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఆంధ్రకేసరి 152వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయం నందు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా యస్.పి. డాక్టర్.కె. తిరుమలేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రివర్యులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులని, అటువంటి వ్యక్తి సర్వ త్యాగనిరతిని, దేశభక్తిని, నిరాడంబరతను, ప్రజా సంక్షేమ దష్టిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో జన్మించిన ఆయన ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించారన్నారు.మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి కెదురుగా వెళ్లి తన గుండెను చూపించిన ధీరుడు. తద్వారా ఆంధ్ర కేసరి అని పేరు పొందారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.నిజాయితీకి మారుపేరైన ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










