Nov 08,2023 00:23

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న విశ్వశాంతి స్కూల్‌ ప్రిన్సిపల్‌, జెవివి నేతలు

ప్రజాశక్తి- అనకాపల్లి
నానాటికీ మూఢనమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా సైన్సు ఉద్యమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ ఉద్యమాన్ని బలపరచాలని జన విజ్ఞాన వేదిక అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కొలగాని వరప్రసాద్‌ పిలుపునిచ్చారు. స్థానిక విశ్వశాంతి స్కూల్‌ ఆవరణలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ విజరు కుమార్‌ అధ్యక్షతన సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర ప్రసాద్‌ మాట్లాడుతూ నవంబర్‌ 7 నుండి 2024 ఫిబ్రవరి 28వ తేదీ వరకు శాస్త్ర ప్రచార ఉద్యమంలో భాగంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందిందని, విద్యా వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు రవాణా కమ్యూనికేషన్‌ తదితర అన్ని రంగాల్లో నేడు పెద్ద ఎత్తున పురోగతి చూస్తున్నామని తెలిపారు. దేశంలో చంద్రయాన్‌-3, గగన్యాన్‌ ఆదిత్య ఎల్‌1 లాంటి అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ స్థాయి ప్రశంసలు అందుకోగా, అశాస్త్రీయ భావనలు, మూఢనమ్మకాలు, మతమౌడ్యాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. జీవశాస్త్రానికి పునాది వంటి డార్విన్‌ పరిణామవాదం సిలబస్‌ నుండి తొలగింపునకు గురవుతుందన్నారు. సైన్సు ప్రచార సారధులైన నరేంద్ర దబోల్కర్‌, పన్సారి, కుల్బుర్గి, గౌరీ లంకేష్‌ తదితరులను మతోన్మాదులు హతమార్చడంతో పాటు ప్రజాస్వామ్య లౌకిక పరిరక్షణకు పాటుపడే వారిపై దాడులు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న జెవివి సైంటిఫిక్‌ టెంపర్‌ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ప్రిన్సిపాల్‌ విజయ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలకు దూరంగా ఉంటూ శాస్త్రీయ అవగాహనతో పురోభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి బి.ఉమామహేశ్వరరావు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రామారావు పాల్గొన్నారు.