ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఐసిడిఎస్ ఆధ్వర్యంలో 30వ తేదీ వరకూ కొనసాగే పోషణ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాలులో సామూహిక సీమంతాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, అందులో భాగంగా ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఈ నెల 30వ తేది నుండి జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. గర్భిణులకు అవసరమైన పోషకాహారాన్ని టేక్ హోం రేషన్ ద్వారా బెల్లం, ఖర్జూరం, పాలు వంటి వాటిని అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రక్తహీనత ప్రతి వంద మందిలో 32 మందికి ఉందని, తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే పిల్లలు శారీరకంగా, మానసింగా బలంగా ఉంటారని అన్నారు. ప్రతినెలా 9వ తేదిన ప్రభుత్వాస్పత్రుల్లో నిర్వహించే వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గర్భిణులు శారీరకంగా బలంగా, మానసికంగా సంతోషంగా ఉన్నపుడే ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారన్నారు. చిన్నచిన్న సమస్యలకు కుంగిపోవద్దని అన్నారు. గర్భం దాల్చిన నాటి నుండి ఒకే డాక్టరు వద్ద వైద్యం చేయించుకోవాలని సూచించారు. డాక్టర్‌ను మార్చుకోవాల్సి వస్తే ముందుగానే సంద్రించి వివరాలన్నీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అందిస్తున్న జగన్న సంపూర్ణ పోషణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ఒక్కో కిట్‌పై రూ.650/- ఖర్చు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రవి, ఐసిడిఎస్ అధికారి బి.అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.










