Jul 18,2023 21:14

పిల్లల తల్లిదండ్రులకు సూచనలు ఇస్తున్న డిఐఒ జగన్మోహనరావు

ప్రజాశక్తి - సీతంపేట : ప్రజారోగ్యంపై దృష్టి సారించి అన్ని ఆరోగ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) టి. జగన్మోహనరావు సూచించారు. మండలంలోని దోనుబాయి, కుసిమి పిహెచ్‌సిలను, స్థానిక ఏరియా ఆస్పత్రిలో గల ఎన్‌ఆర్‌సి (పోషకాహార పునరావాస కేంద్రం) కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. పిహెచ్‌సిల్లో సిబ్బంది హాజరు, ఒపి రికార్డ్‌, ఎటువంటి అనారోగ్య లక్షణాలు నమోదు అవుతున్నవి, ల్యాబ్‌ పరీక్షలు, మందుల నిల్వలు, వ్యాక్సిన్‌ నిల్వలు, వార్డు, ప్రసూతి గది తదితర అంశాలను పరిశీలించారు. సంబంధిత సేవల రికార్డుల నమోదు,ఆన్లైన్‌ నమోదుపై సిబ్బందిని ఆరా తీశారు. సూపర్‌ వైజర్లు విధిగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రతి ఆరోగ్య కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వైద్య సిబ్బంది అంతా ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. ప్రగతి నివేదికలు పురోగతి చెందాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం అక్కడ రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న టీకా కార్యక్రమానికి సంబంధించి మిషన్‌ ఇంద్ర ధనుష్‌ సర్వే పై సిబ్బందిని ఆరా తీశారు. సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా అన్ని గ్రామాల్లో అవసరమైన మందులు, పరీక్షలు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఎన్‌ఆర్‌సి కేంద్రాన్ని డిఐఒ సందర్శించి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ వెంకటరావుతో కలిసి అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారుల ఆరోగ్య పర్యవేక్షణ చేశారు. బరువు తక్కువగా, పోషకాహార లోపం గల పిల్లలు పూర్తి స్థాయిలో ఆరోగ్య వృద్ధి చెందిన తర్వాతే డిశ్చార్జ్‌ చేయాని సిబ్బందికి సూచించారు. ప్రతినెలా చేరుతున్న అవుతున్న పిల్లల జాబితా రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎన్‌ఆర్సి వైద్యాధికారి డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌, వైద్యాధికారులు డాక్టర్‌ ఎస్‌.భానుప్రతాప్‌, బి.రవీంద్ర, సూపర్‌ వైజర్లు ప్రమీలారాణి, నిర్మలకుమారి, జయగౌడ్‌, రాజారావు, గంగమ్మ, దమయంతి, సీతారామరాజులు, వెంకటేశ్వర్లు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.