ప్రజారోగ్యమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం : ఎంఎల్‌ఎ
చిత్తూరుఅర్బన్ : ప్రజల ఆరోగ్యం కోసమే ''జగనన్న ఆరోగ్య సురక్ష'' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. చిత్తూరు నగరపాలక సంస్థ కాజూరు పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో బీఎస్ కన్నన్ పాఠశాల ఆవరణంలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ ఎస్ అముద, కమిషనర్ డా. జె అరుణ పర్యవేక్షించారు. వైద్య శిబిరంలో ఏర్పాటుచేసిన కౌంటర్లను సందర్శించి రోగులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విభాగాల వారీగా అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు సంతప్తికర స్థాయిలో వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. రోగుల పరీక్ష కేంద్రంలో ఎమ్మెల్యే బిపీ పరీక్ష చేయించుకున్నారు. వైద్య శిబిరానికి రాలేనివారిని అంబులెన్స్ వాహనాల్లో వారి ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేసి తిరిగి ఇంటివద్ద వదిలారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతీదేవి, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ రాంగణేష్, సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంహెచ్వో డా.లోకేష్, సీఎంఎం గోపి పాల్గొన్నారు.










