Oct 09,2023 23:27

ప్రజాశక్తి - చిన్నగంజాం
జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును ఏపీ ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి డాక్టర్ యాదాల అశోక్ బాబు సోమవారం పర్యవేక్షించారు. మండలంలోని కడకుదురు పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిభిరంలో ఆయన మాట్లాడారు. డబ్బు లేదనే కారణంతో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఎవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్థోపెడిక్, గుండె సమస్యలు, డయాలసిస్, జనరల్ మెడిసిన్ వైద్య బృందం రోగులకు అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఇంటి వద్ద వైద్యం అందించే విదంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వైద్యశిభిరంలో ఏడు రకాల పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. 172రకాల మందులు ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ ప్రైవేట్ హాస్పటల్లో చేయించుకోవాలంటే రూ.2వేలకుపైగా అవుతాయని తెలిపారు. ఒక కుటుంబంలో నలుగురుంటే రూ.8వేల విలువైన వైద్యం ఇంటి వద్దనే ఉచితంగా అందించేలా దేశంలోనే మన రాష్ట్రం ఒక్కటేనని తెలిపారు. 45రోజుల పాటు సాగే వైద్యశిభిరంలో అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కార్పొరేట్ హాస్పిటల్లో చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కంటి సంబంధిత వ్యాధులకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతూ అవసరమైన కళ్ళజోళ్ళు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంగన్వాడీలు ఏర్పాటు చేసిన జగనన్న పౌష్టికాహారం పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గతంలో కంటే మెరుగ్గా క్వాలిటీ పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు. వైద్యశిభిరంలో 562మందికి వైద్యపరీక్షలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ జి శివ కుమారి, ఎంపిడిఓ కె స్వరూపరాణి, ఈఓఆర్డి ఎన్‌విజికె మూర్తి, ఎంఈఓ-2, సంతరావూరు పిహెచ్‌సి  వైద్య బృందం, పంచాయతీ కార్యదర్శి ఎన్ సూర్యనారాయణ పాల్గొన్నారు.