Oct 06,2023 21:02

సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి - పాచిపెంట :  రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర అన్నారు. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష (జె.ఏ.ఎస్‌) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మండలంలోని కర్రివలసలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శుక్రవారం పాల్గొన్నారు. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. శిబిరాలకు వచ్చిన వ్యక్తులతో మాట్లాడి వైద్యం అందుతున్న విధానాన్ని ఆరా తీశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పౌష్ఠికాహారం ప్రదర్శన శాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాల్లో 172 రకాల మందులు, 14 రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరికీ మంచి వైద్య సేవలు అందించాలని, ఎంత ఖర్చు అయినప్పటికీ భరించుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 45 రోజుల పాటు సాగుతుందని అన్నారు. జిల్లాలో నవంబరు 10 వరకు వైద్య శిబిరాలు జరుగుతాయన్నారు. అనంతరం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహార స్టాల్స్‌ ను ఆయన పరిశీలించారు కార్యక్రమంలో డిఎస్‌ఒ శివప్రసాద్‌, ఎంపిడిఒ డాక్టర్‌ శివకుమార్‌, సిడిపిఒ బి.అనంతలక్ష్మి పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.