ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్: ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించి సురక్షితంగా ఉండేందుకు ఇంటి వద్ద ఉచిత వైద్యం అందించాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మండలంలోని అడ్డాపుశీలలో గల మండల పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత మోడల్ మెడికల్ క్యాంపును మంగళవారం ఆయన సందర్శించారు. వైద్య చికిత్స కోసం వచ్చిన బాధితుల రిజిస్ట్రేషన్ వివరాలు, కేస్ షీట్, మందుల నిల్వలు, వివిధ కౌంటర్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటి తలుపు తట్టి ఆరోగ్య సమస్యలను పరీక్షించడంతో పాటు మెరుగైన వైద్యం అందించి నయం చేసేలా ప్రభుత్వం భాధ్యత తీసుకుంటుందన్నారు. రోగులను గుర్తించి ఉచితంగా ఏడు రకాల పరీక్షలు నిర్వహించాలన్నారు. ఉచిత మెడికల్ క్యాంపులు తహశీల్దార్, ఎంపిడిఒలు పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ఎంపిడిఒలు క్యాంపుల నిర్వహణను గ్రామ వాలంటీర్లతో ముందురోజు సమావేశాలు నిర్వహించి అందరికీ తెలియజేయడంతో పాటు వైద్యం కోసం వచ్చే బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్లాట్ విధానం పాటించాలన్నారు. కేన్సర్, కిడ్నీ వంటి దీర్ఘకాలిక బాధితులు ఉన్నట్లయితే గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యుల సూచనల మేరకు మందులు అందిస్తామని తెలిపారు. అవసరమైతే ఆస్పత్రులకు తరలించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్యాంపు పూర్తి బాధ్యతను ఫ్యామిలీ డాక్టర్ తీసుకుని మందుల కొరత లేకుండా అవసరమైన మేరకు నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలతో పాటు రక్తహీనత బాధితులను గుర్తించి అవసరమైన మందులు, ఫుడ్ సప్లిమెంటేషన్ అందజేయాలన్నారు. బాధితులకు చికిత్స అందిస్తూనే జీవన శైలిలో తీసుకోవాల్సిన ఆహార నియమాలు, ఆయా వ్యాధులు సోకకుండా ముందస్తుగా నివారణకు పాటించాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం కోసం అందుబాటులో ఉన్న సేవలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. కంటి పరీక్షలు అనంతరం వృద్ధులకు కళ్లాద్దాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ప్రజలు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కొయ్యాన అప్పారావు, జిల్లా ఆర్బిఎస్కే అర్ బి ఎస్ కె అధికారి డాక్టర్ ధవళ భాస్కర రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ టి.జగన్మోహన్ రావు, ఐసిడిఎస్ పిడి కె.విజయ గౌరి, జిల్లా ఆసుపత్రి సూపరిండెండెంట్ డా, వాగ్దేవి, వైద్యులు, తహశీల్దార్ శివన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.










