Nov 02,2023 21:17

ప్రజారక్షణ భేరీ బస్సుయాత్ర

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి :  జిల్లాలోని కీలకరంగాలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకపోవడంతో వాటి పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఫలితంగా ఏటా కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చెరకు రైతుల జీవనోపాధిపైనా కోలుకోలేని దెబ్బతీసింది. పరిశ్రమల ఏర్పాటుపై, ఉన్న పరిశ్రమల మనుగడకు సిఎం జగన్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. విద్యుత్‌ భారాలతో జిల్లాలోని ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు ఒక్కక్కొటిగా మూతపడుతున్నాయి. ఇవేవీ పట్టని వైసిపి మళ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తోంది. టిడిపి నాయకులు అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన పార్టీ అధినేత చంద్రబాబు కోసం తప్ప, ప్రజా సమస్యలపై స్పందించడం లేదు. జనసేన కూడా అదే దారిలో నడుస్తోంది. ఈనేపథ్యంలో సిపిఎం ప్రజారక్షణ భేరీ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజాసమస్యలపై పోరాడేందుకు సన్నద్ధమైది. అందులో భాగంగానే ఈనెల 30న మన్యం జిల్లా సీతంపేటలో ప్రారంభమైన జిల్లాలోని పలు మండలాలు మీదుగా అల్లూరి జిల్లాలోకి వెళ్లింది. ఇటు మైదాన, పట్టణ ప్రాంతాలను కలుపుతూ శ్రీకాకుళం జిల్లా మందసలో గురువారం ప్రారంభమైన మరో ప్రజారక్షణ భేరీ బస్సుయాత్ర శుక్రవారం పూసపాటిరేగ మీదుగా విజయనగరం, ఎస్‌.కోట, కొత్తవలస వరకు సాగుతుంది. విజయనగరంలో ఉదయం 10గంటలకు కోట వద్ద బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన సమస్యలు, ఎన్నికలకు ముందు సిఎం జగన్మోహన్‌రెడ్డి హామీలను చాలా మంది గుర్తు చేస్తున్నారు.
సిఎం జగన్‌ ఎన్నికలకు ముందు విజయనగరం జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో సాగునీటి కేటాయింపులు పెంచుతామని, ఈ జిల్లాలో తోటపల్లి, తామ తీర్థసాగర్‌ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఆచరణలో మాట నిలబెట్టుకోలేదు. సుమారు 24 వేల ఎకరాలకు సాగునీటితో పాటు విజయనగరం ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2004లో తలపెట్టిన రామతీర్థసాగర్‌ ప్రాజెక్టుకు గతేడాది (2022-23) 124.50 కోట్లు కేటాయిస్తామంటూ బడ్జెట్‌ సమావేశంలో చెప్పిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంతకు ముందు మూడేళ్లు కూడా పెద్దగా నిధులు కేటాయించలేదు. దీంతో, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో భూములు బీడువారుతున్నాయి. ఈ ఏడాది ఈ మండలాల్లో కరువు కోరల్లో ఉన్నాయి. అటు విజయనగరం పట్టణ వాసుల దాహర్తి కూడా తీరడం లేదు.
లక్ష్యానికి చేరుకోని తోటపల్లి
సుమారు 64 వేల ఎకరాల సాగునీటిని స్థిరీకరిస్తూనే పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1,31,221 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2004లో తోటపల్లి ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటి వరకు రూ.891 కోట్లు ఖర్చు చేసినప్పటికీ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల అంచనా వ్యయం ఏటా పెరిగిపోతోంది. పెండింగ్‌ పనుల వల్ల పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు 58,757 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. విజయనగరం జిల్లాలో ఈ ఏడాది కేవలం 35వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించినట్టు సాక్షాత్తు అధికారులు చెబుతున్నారు. పునరావాసానికి మొత్తం రూ.204కోట్లు అవసరం ఉన్నట్టు అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఆచరణలో ఈ ఏడాది కేటాయించింది కేవలం రూ.10కోట్లు మాత్రమే. దీంతో, నిర్వాసితులంతా నిలువ నీడలేక, వ్యవసాయ భూములకూ దూరమై, బతుకు భారమై తల్లడిల్లుతున్నారు.
విద్యుత్‌ భారంతో కుదేలైన ఫెర్రో పరిశ్రమలు
విద్యుత్‌ ఛార్జీలతో ల్లాలో ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు మూడపడుతున్నాయి. అధికారంలోకి రాగానే వీటిని బలోపేతం చేస్తానని సిఎం జగన్‌ చెప్పారు. గరివిడి, గుర్ల, మెరకముడిదాం, బొబ్బిలి, కొత్తవలస ప్రాంతాల్లో 21 వరకు పరిశ్రమలు ఉండేవి. వీటిలో మూడు చాలా కాలం క్రితం మూతపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ ఛార్జీలు పెంచడంతో భారాన్ని తట్టుకోలేక బొబ్బిలిలో ఉన్న సిరి ఫెర్రో, యోన, ఇంపెక్స్‌, గరివిడిలో ఉన్న ఆంధ్రా ఫెర్రో సహా మొత్తం 10 పరిశ్రమలు మూతపడ్డాయి. గరివిడి ఫేకర్‌లో ఉత్పత్తి తగ్గించడం వల్ల ఒకే ఒక్క ఫర్నేస్‌ నడుస్తోంది. దీంతో, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
బొబ్బిలిలో శ్రీనివాసా జ్యూట్‌ మిల్లును తెరిపిస్తామంటూ జగన్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆచరణలో యాజమాన్యంతో కుమ్మకై రియల్‌ ఎస్టేట్‌ కోసం విక్రయించారు. దీంతో, వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
ఆధునీకరణ పేరిట రెండేళ్ల క్రితం భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని మూసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తగినంత చెరకు ఉత్పత్తి లేని కారణంగా తెరవలేక పోతున్నామని మంత్రి బొత్స బుకాయిస్తున్నారు. దీంతో, స్థానిక రైతులు రేగిడి మండలం సంకిలి వరకు తీసుకెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తోంది.
సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సిఎస్‌ సుగర్స్‌ యాజమాన్యం రైతులకు బకాయిల చెల్లింపు పేరిట యాజమాన్యంతో కుమ్మకై ఏకంగా ఆ పరిశ్రమకు చెందిన భూములే విక్రయించారు. వీరు ఇక్కడి రైతులు కూడా చెరకు సంకిలి ఫ్యాక్టరీకి తీసుకెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తోంది.
మరోవైపు సారిపల్లి, విటి అగ్రహరం, కంటకాపల్లి, బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ పారిశ్రామిక వాడలు బోసిపోతున్నాయి. కొత్త పరిశ్రమలు రావడం లేదు సరికదా ఉన్న చిన్నచిన్న పరిశ్రమలు కూడా ఒకొక్కటిగా మూతపడుతున్నాయి. ఎస్‌.కోటలో స్మాల్‌ స్కేల్‌ ఇండిస్టీస్‌ ఏర్పాటు చేస్తామంటూ మంత్రి మండలిలో తీర్మానం చేసినప్పటికీ ఆచరణలో అటువంటి ప్రయత్నాలు కనిపించడం లేదు. ఇలా ఎన్నో సమస్యలు, మరెన్నో అభివృద్ధి ఆటంకాలతో ఒక్క అడుగు ముందుకు నాలుగు అడుగుల వెనక్కి అన్న చందంగా ముందుకు సాగుతోంది. ఈనేపథ్యంలో ప్రజారక్షణ భేరీ పేరిట సిపిఎం పేరిట చేపట్టిన బస్సు యాత్ర చర్చనీయాంశంగా మారింది.