ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రాష్ట్రంలో అసమానతలు లేని అభిటఔద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 15న విజయవాడలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రజలు హాజరై జయప్రదం చేయాలని సిపిఎం నగర 2వ కమిటీ కార్యదర్శి ఆర్‌వి.నాయుడు పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం సిపిఎం నగర న్యూ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్‌లో ప్రచారం నిర్వహించి బహిరంగ సభ పోస్టర్ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలను అనుసరిస్తున్నాయని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు కోతలు విధిస్తోందన్నారు. సాధించుకోవాల్సిన వైసిపి ప్రభుత్వం మోదీకి మొకరిల్లుతు ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టేశారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షాలు టిడిపి, జనసేన పార్టీలు కూడా మోదీ ప్రభుత్వానికి సాగిలపడుతున్నాయని విమర్శించారు. బహిరంగ సభను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర న్యూ కమిటీ నాయకులు ముత్తుజా, ఏటిఎం.నాగరాజు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
గుంతకల్లు : సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 15న విజయవాడలో నిర్వహించనున్న ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక హంపిరెడ్డి భవనంలో ప్రజా రక్షణభేరి సభకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆయన మాట్లాడుతూ అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుజాతాలు నిర్వహించామన్నారు. ముఖ్యంగా వెనుకబడిన అనంతపురం జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. విద్య, వైద్యం అందుబాటులో ఉంచాలన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలని, వ్యవసాయ కార్మికులకు సొంత గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని, గ్రామాలు, పట్టణాలు, జిల్లాలను అభివృద్ధి పథంలో నడపాలని ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈనెల 15న విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు హాజరుకానున్నట్లు తెలిపారు. కావున మండలంలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, చేతివృత్తిదారులు, చిన్న సన్నకారు రైతులు, మహిళలు, విద్యార్థులు,నిరుద్యోగులు భారీగా తరలివచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, మారుతిప్రసాద్, కసాపురం రమేష్, సాకే నాగరాజు, సభ్యులు రామునాయక్, తిమ్మప్ప, వెంకీ, అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.