ప్రజారక్షణ భేరిని జయప్రదం చేయండి
4న జిల్లాకు సిపిఎం బస్సు జాతా
ప్రజాప్రణాళికను విడుదల చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజారక్షణ భేరి కార్యక్రమం జరుగుతున్నదని, దీన్ని జయప్రదం చేయాలని సిపిఎం ప్రజాప్రణాళికను బుధవారం చిత్తూరు సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలందరినీ కలవరపరుస్తున్నాయని అన్నారు. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూసే కన్నా మన బతుకులను రాష్ట్ర భవిష్యత్తును సక్రమంగా నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టి పది సంవత్సరాలు పూర్తికావస్తోందని, అప్పుడు కేంద్రంలోని బిజెపి నాయకులు మనకు అర చేతిలో స్వర్గం చూపించారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కుఫ్యాక్టరీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వే జోన్ వంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని గుర్తు చేశారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం ప్రజారక్షణ భేరి కార్యక్రమం నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నదని, ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రణాళికను ప్రజలు ముందు ఉంచిందని తెలిపారు. కరెంట్ యూనిట్ రూపాయికే, పేదలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా, స్మార్ట్ మీటర్లు వద్దు, ఛార్జీలు రద్దు చేయాలని, రూ.400లకే గ్యాస్, రూ.60లకే లీటర్ పెట్రోల్, డీజిల్, ఇసుక ఉచితం, అందరికీ సంక్షేమం పెన్షన్, రేషన్ కార్డులు, అన్ని రకాల పెన్షన్లు రూ.5వేలు, పేదలకు రెండు సెంట్లు ఇల్లు, ఐదు లక్షల ఆర్థిక సాయం, 40 వేల టీచర్లకు మెగా డీఎస్సీ, 2 లక్షల 50 వేల ప్రభుత్వ ఖాళీ పోస్టులు, నిరుద్యోగ భతి నెలకు రూ.5వేలు, ఓపీఎస్ పునరుద్ధరణ, ప్రైవేటు ఉపాధ్యాయులు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, భూమిలేని వ్యవసాయ కూలీలకు కౌలు రైతులకు రెండు ఎకరాల భూమి, అసలు పట్టాదారులకే అసైన్మెంట్ భూముల హక్కులు కల్పించడం, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 200 రోజులు, పని గ్యారంటీ అసంఘటితరంగా కార్మికుల కనీసం 26,000, సమగ్ర సంక్షేమ చట్టం స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, రైతులు గిట్టుబాటు ధర కల్పించడం లాంటి ప్రజాప్రణాళికను సిపిఎం విడుదల చేసిందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో కూడా పలమనేరులో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని, జిల్లాలో పండ్ల రైతులు ఆదుకోవడానికి ఫల్ప్ ఫ్యాక్టరీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, నగరిలో పవర్ లూం కార్మికులకు కూలి రేట్లు పెంచి, 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, చిత్తూరు జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజారక్షణ భేరి జయప్రదం చేయడానికి నవంబర్ 4న జిల్లాకు వస్తున్న సిపిఎం బస్సు జాతాను జిల్లాలోని ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే.సురేంద్ర, పి.చైతన్య, బాల సుబ్రహ్మణ్యం, దాము, రామచంద్ర, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










