

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి/సాలూరు, సీతానగరం, మక్కువ
పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు రోజులపాటు సాగిన ప్రజారక్షణ భేరీ బస్సుయాత్రకు విశేష ఆదరణ లభించింది. దారిపొడవునా మహిళలు హారతులిచ్చి, పూలతో స్వాగతం పలికారు. నాయకులకు తిలకం దిద్దుతూ ఆప్యాయతగా పలకరించారు. కురుపాం, మక్కువ, సాలూరు, మెంటాడల్లో జరిగిన సభలకు గిరిజనులు కొండకోనలు దాటుకుంటూ తరలివచ్చారు. సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనున్న మక్కువ మండలం కాముడు వలస నుంచి మూడు నెలలు, ఏడాది చంటి బిడ్డలను ఎత్తుకుంటూ మక్కువలో జరిగిన సభకు కాలినడకన రావడం ఎర్రజెండాపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యాత్ర సాగిన ప్రతిచోటా స్థానికులు డప్పుల దరువు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఎర్రజెండా చేతబూని రెపరెపలాడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, ఉద్యోగ, కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున చేసిన నినాదాలు మిన్నంటాయి. యాత్రలో పాల్గొన్న నాయకులు కూడా రాత్రి పూట గ్రామాల్లోనే బస చేస్తూ స్థానికులతో మమేకమై కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ యాత్ర రథసారధి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు వివిధ తరగతులవారు వినతి పత్రాలు అందజేశారు. వీటిని స్వీకరించిన ఆయన పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని, అవసరమైనప్పుడు ప్రజాక్షేత్రంలో పాలకపార్టీలను ఎండగట్టేందుకు ప్రజలు కూడా సిద్ధపడాలని కోరారు. సామాజిక సాధికార యాత్ర పేరిట వైసిపి, న్యాయం గెలవాలి అంటూ టిడిపి, వరాహి పేరిట జనసేన పార్టీలు మరోసారి జనాన్ని వంచించేదుకు ప్రయత్నిస్తున్నాయని, ఈనేపథ్యంలో ప్రజలకు రక్షణగా నిలిచి మోసకారి రాజకీయ విన్యాసాలను వివరించేందుకే సిపిఎం ఆధ్వర్యాన ప్రజారక్షణ యాత్ర చేపడుతున్నామని వివరించారు. యాత్రలో సోమవారం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, మంగళవారం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి పాల్గొన్న సంగతి తెలిసిందే.
రెండో రోజు ప్రజా రక్షణ భేరి యాత్ర సీతానగరం మండలం చినబోగిలి, మక్కువ, సాలూరు మీదుగా మెంటాడ మండల కేంద్రం వరకు సాగింది. చినబోగిలి ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి స్థానిక ప్రజలు ప్రదర్శనతో స్వాగతం పలికారు. సాలూరులో గాంధీనగర్ జంక్షన్ వద్ద బస్సు యాత్రలో వున్న నాయకుల బృందానికి నియోజకవర్గ సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాన రహదారి మీదుగా బోసుబొమ్మ జంక్షన్ వరకు, మెంటాడ ముఖ ద్వారం నుంచి ప్రధాన రహదారి చివరి వరకు డప్పువాయిద్యాల నడుమ ప్రదర్శన చేపట్టారు. చినబోగిలిలో రైతు సంఘం నాయకులు రెడ్డి లక్ష్మునాయుడు, మక్కువలో సిపిఎం మన్యం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి ఇందిర, సాలూరులో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్.అప్పారావు, మెంటాడలో విజయనగరం జిల్లా పార్టీ కార్యదర్శి వి.లక్ష్మి అధ్యక్షతన సభలు జరిగాయి.

సాలూరులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి : విఎస్‌ఆర్
సాలూరులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. లారీ రవాణా రంగంలో విజయవాడ తరువాత అంతటి సంఖ్యలో లారీలు ఉన్న సాలూరులో కనీస సదుపాయాలు కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు. మెకానిక్ వర్కుషాపులు, టైర్లు తదితర సామగ్రి అందుబాటులో ఉండే విధంగా సాయపడాలని లారీ ఓనర్లు చాలా కాలంగా కోరుతున్నా పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. దీనికితోడు కేంద్రం అనుసరిస్తున్న మోటార్ వాహన చట్టాల వల్ల కూడా యజమానులు ఆర్థికంగా కుదేలవుతున్నారని తెలిపారు. దీంతో లారీ డ్రైవర్లు, క్లీనర్లు కూడా ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటోనగర్ కోసం భూమి సేకరించినప్పటికీ ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టలేదని విమర్శించారు. మరోవైపు సాలూరుకు కూత వేటు దూరంలోవున్న 17నెలలుగా మూతపడి వున్న జీగిరాం జ్యూట్ మిల్లును వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. రూ.4కోట్ల ఖర్చుతో 9వేల ఎకరాలకు సాగునీరందించే గుర్ల గెడ్డ ప్రాజెక్టును పాలకులు గాలికి వదిలేశారని విమర్శించారు. ఇప్పటికైనా దీన్ని పూర్తిచేయకపోతే ప్రభుత్వ భరతం పడతామన్నారు. మెంటాడ మండలంలో అనేక గ్రామాల్లో తాగునీటి సదుపాయం కూడా కల్పించకపోవడం వల్ల గిరిజనులకు ఊటనీరే గత్యంతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులు దోపిడీకి గురవుతున్నారని, తాగడానికి మంచినీరు కూడా వైసిపి ప్రభుత్వం అందించడం లేదన్నారు. కనీస సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గిరిజనులకు ప్రాతినిద్యం వహిస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర ఈ బురద నీరు తాగ గలరా అని ప్రశ్నించారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయకుండా విశాఖ నుంచి రాయపూర్‌కు వేల కోట్లు పెట్టి రోడ్డు వేస్తున్నారని అన్నారు.


సీనియర్ నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 80 వేలతో పేదలు ఎలా ఇళ్లు కడతారని ప్రశ్నించారు. కనీసం యూనిట్ విలువ ఐదు లక్షల రూపాయలు వుండాలన్నారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలతో ప్రభుత్వమే పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతోందని చెప్పారు. వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులు భూములు, ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
చెరకు రైతులకు మోసం : ఎంఎస్
ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి చెరకు రైతుల్ని మోసం చేసిందని విమర్శించారు. లచ్చయ్యపేట ఎన్‌సిఎస్ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే, కమిషన్ల కోసం ఆ ఫ్యాక్టరీ భూములు విక్రయించారని అన్నారు. అంతకు ముందు కూడా రూ.150కోట్ల విలువగల ఈ ఫ్యాక్టరీని ఎన్‌సిఎస్ యాజమాన్యానికి రూ.13కోట్లకు కట్టబెట్టిందని గుర్తు చేశారు.
అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజన కార్మికులు తదితర స్కీమ్ వర్కర్లపై పనిభారం పెంచినప్పటికీ, వేతనాలు పెంచలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ విమర్శించారు. 95శాతం హామీలు అమలు చేసినట్టు చెప్పుకుంటున్న జగన్మోహన్‌రెడ్డి వేతనాల పెంపు విషయమై అంగన్‌వాడీలకిచ్చిన మాట ఎందుకు తప్పారని ప్రశ్నించారు. న్నికల్లో ఓట్లు దండుకోవడానికే వైసిపి సామాజిక సాధికారిక యాత్ర చేపట్టిందన్నారు. వైసిపితోపాటు టిడిపి, జనసేన కూడా బిజెపి ఏం చేసినా తానా అంటే తందాన అంటూ కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. మోడీ, జగన్ అనుసరిస్తున్న విధానాలు ఉద్యోగ, ఉపాధిని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ జీగిరాం జ్యూట్ మిల్లు కార్మికులు, అంగన్‌వాడీలు, సాలూరు, మక్కువ, మెంటాడ మండలాలకు చెందిన గిరిజనులు, గుర్లగెడ్డను పూర్తిచేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలంటూ రైతులు యాత్రకు నాయకత్వం వహిస్తున్న శ్రీనివాసరావుకు వినతులు అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఎన్‌వై నాయుడు, సీదరపు అప్పారావు, విజయనగరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు పి.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.