
ప్రజాశక్తి-సాలూరు : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చైతన్య పరచడానికి సిపిఎం ఆధ్వర్యాన చేపట్టనున్న ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. ఈ నెల 30న పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ప్రారంభం కానున్న ప్రజారక్షణ భేరి యాత్ర 31న మధ్యాహ్నం 12 గంటలకు సాలూరు చేరుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో మంగళవారం సిపిఎం నాయకులు సీదరపు అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. వైసిపి, టిడిపి, బిజెపిలు సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీలను పాలకపార్టీలు గాలికొదిలేశాయని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, నిరుపేదలు బతకలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను చైతన్య పరచడానికి సిపిఎం ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను చేపడుతోందని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ బస్సు యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. పార్వతీపురంలో జరిగే బహిరంగ సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి పాల్గొంటారని చెప్పారు. అనంతరం నవంబర్ 15న విజయవాడలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్‌వై నాయుడు, మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.