
ప్రజాశక్తి-దొనకొండ: రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధన కోసం సీపీఎం ప్రణాళిక రూపొందించిందని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నవంబరు 15వ తేదీన విజయవాడలో సీపీఎం ప్రజా రక్షణభేరి సభ నిర్వహిస్తోందని, ప్రజలు భారీగా తరలిరావాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. దొనకొండలో సీపీఎం కార్యకర్తల సమావేశం కుందుర్తి అనిల్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సంక్షేమ పథకాల అమలుతోనే సమగ్ర అభివృద్ధి సాధిస్తామని చెప్పుకోవటం విచారకరమని అన్నారు. ప్రజలకు పథకాల ఆశ చూపి మభ్యపెడుతున్నారని, అటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలతోనే సాధ్యమని, ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్లపాటు ప్రాజెక్టులు, ప్రజల అవసరాల పట్ల చిత్తశుద్ధి లేకుండా కొనసాగిందని విమర్శించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు తాండవ రంగారావు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో కరువు ఛాయలు విస్తరిస్తున్నాయని, వర్షాలు లేక సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని, సాగర్ నీరు రాదు, వరి పంట సాగుచేయవద్దని ప్రభుత్వం ముందుగానే ప్రకటించనందున ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరిపంట వేయనందున తిండి గింజలతో పాటు పశువులకు మేత కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనులను విస్తరించి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వంకు డిమాండ్ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ దొనకొండలో రెండు నెలలుగా తాగునీటి సరఫరా ఆగిపోయి నీటి కష్టాలు ఎదురయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కిరణ్‌కుమార్, అంజిబాబు, ఏసుదాసు, ఉదరుకిరణ్, శ్రీకాంత్ రమణయ్య, రాఘవులు, మరికొందరు కార్యకర్తలు పాల్గొన్నారు.