
ప్రజాశక్తి-తాడేపల్లి : నవంబర్ 15న విజయవాడలో జరిగే సిపిఎం ప్రజా రక్షణభేరి ప్రణాళికను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ప్రజా రక్షణ భేరి జయప్రదం చేయాలని కోరుతూ ఆ పార్టీ శ్రేణులు ఉండవల్లి సెంటర్‌లో శుక్రవారం ప్రచారం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడారు. మేకా అమరారెడ్డి భవన్‌లో కరపత్రాన్ని రామారావు ఆవిష్కరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, కొట్టె కరుణాకరరావు, డి.శ్రీనివాసకుమారి, వేముల దుర్గారావు, వై.బర్నబస్, డివి భాస్కరరెడ్డి, ఆచారి పాల్గొన్నారు. అనంతరం సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ రాజధాని డివిజన్ కమిటీ విస్తృత సమావేశం ఎస్‌కె పీరూసాహెబ్ అధ్యక్షతన జరిగింది. రామారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని ప్రజలపై భారాలు మోపుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా వెన్కుబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపితో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి వంత పాడటాన్ని ప్రజలు క్షమించరన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకుండా రాజధాని ప్రజలను నట్టేటా ముంచారని దుయ్యబట్టారు. మూడు రాజధానుల పేరుతో విశాఖపట్నం వెళ్లడం భూములు కొల్లగొట్టడానికేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల నుండి బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. యాత్రల ముగింపు సందర్భంగా నవంబర్ 15న బిఆర్‌టిఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ నుంచి మహా ప్రదర్శన, రెడ్‌షట్ వాలంటీర్ల కవాతు ఉంటుందని చెప్పారు. సింగ్‌నగర్ ఎంబి స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. సమావే శంలో రాజధాని డివిజన్ కారదర్శి ఎం.రవి, నాయకులు ఎం.భాగ్యరాజు, వల్లభాపురం వెంకటేశ్వరరావు, సిహెచ్.సుందరరావు, కె.రామకృష్ణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య కోరారు. ఈ మేరకు కరపత్రాన్ని స్థానిక సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. చెంగయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయమేమీ చేయలేదని, పైగా హామీలను విస్మరించి రాష్ట్రాన్ని అన్ని విధాలా అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. బిజెపి విధానాలను తూచా తప్పకుండా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల నుండి బస్సు యాత్రలు చేస్తోందన్నారు. 15వ తేదీన విజయవాడలో జరిగే బహిరంగ సభకు మంగళగిరి ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ప్రజలకు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్, నాయకులు వివి జవహర్లాల్, ఎం.బాలాజీ, ఎస్.వెంకటేష్, కె.వెంకటేశ్వరరావు, డి.రామారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తాడికొండ : విజయవాడలో 15వ తేదీన జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు కె.అజరుకుమార్ కోరారు. ఈ మేరకు పోస్టర్‌ను స్థానిక పాత సినిమా హాల్ వద్ద శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజరుకుమార్ మాట్లాడుతూ సమైక్యంగా మెలగాల్సిన ప్రజల మధ్య కేంద్రంలోని బిజెపి విద్వేషాలు రాజేస్తోందని, ఆ పార్టీ పాలన ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీలకు, స్త్రీలను భద్రత లేదని అన్నారు. వ్యవసాయానికి నష్టం చేసే, ప్రజల ఆహార భద్రతకు ముపు తెచ్చే నల్ల చట్టాలను తెచ్చిందని, వీటికి వ్యతిరేకంగా సాగిన పోరాటంపై దమనకాండను ప్రయోగించిందని విమర్శించారు. ప్రశ్నించే వారిపై కేసులు బనాయించి ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారని అన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బిజెపికి వంతపాడుతూ కృష్ణపట్నం, గంగవరం మేజర్ పోర్టులను అదాని చేతిలో పెడుతోందన్నారు. పాఠశాలలను మూసేస్తున్నారని, ప్రజల కష్టాలు వినేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేదని విమర్శించారు. ప్రమాదంలో పడిన దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిహెచ్.భాస్కరరావు, కె.పూర్ణచంద్రరావు, కె.స్రవంతి, ఐ.రామారావు, బి.భద్రయ్య, ఎం.మోహన్‌రావు పాల్గొన్నారు.