Nov 01,2023 23:44

ప్రజారక్షణ భేరి బస్సుయాత్రను జయప్రదం చేయండి: సీపీఎం

ప్రజారక్షణ భేరి బస్సుయాత్రను జయప్రదం చేయండి: సీపీఎం

ప్రజాశక్తి-వరదయ్యపాలెం: రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివద్ధికి ప్రత్యామ్నాయ విధానాలతో సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా మూడు బస్సు జాతాలు తిరుగుతున్న నేపథ్యంలో ఈ నెల ఐదవ తేదీ శ్రీకాళహస్తిలో జరిగే ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర సభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి జనార్ధన్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన వరదయ్యపాలెం బస్టాండ్‌ ఆవరణలో ప్రజారక్షణ భేరి బ్రోచర్‌ను సిపిఎం కార్యకర్తలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉన్న టిడిపి కాని, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం కాని రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు , కడపలో ఉక్కు కర్మాగార నిర్మాణం , పోలవరం ప్రాజెక్టు నిర్మాణం , వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ , రైతులకు మద్దతు ధర, రుణమాఫీ , ఉచిత విద్యుత్‌ , నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఉద్యోగులకు ఓపిఎస్‌ అమల, రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామిక అభివద్ధి, ప్రత్యామ్నా య విధానాలతో అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎంమూడు బస్సు జాతాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాయలసీమ ఆదోని నుంచి బస్సు జాతా కర్నూలు కడప అనంతపురం జిల్లాల మీదుగా చిత్తూరు తిరుపతి జిల్లాలలో ప్రవేశించి 5వ తేదీ శ్రీకాళహస్తికి వస్తుందని అక్కడ జరిగే బహిరంగ సభలో సత్యవేడు నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సత్యవేడు నియోజకవర్గ నాయకులు మెలుగు రమేష్‌, నాగలాపురం నాగరాజు, మామిడి ధనంజయలు, రమణయ్య, వరదయ్యపాలెం మండలం నాయకులు ఎస్‌ కె బాషా ఆటో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.