
ప్రజాశక్తి-అమలాపురం
లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం ఈ నెల 7న జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజారక్షణ భేరి బస్సుయాత్రను, అమలాపురంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు అండ్రా మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం ప్రచార జాతా నిర్వహిస్తున్నా మన్నారు. అండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్ళు పూర్తి కావస్తోందన్నారు. కేంద్రంలోని బిజెపి నాయకులు ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, కడప ఉక్కు, రైల్వే జోన్ వంటి విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బిజెపి మన రాష్ట్ర పారిశ్రామికాభివద్ధికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి తయారైందన్నారు. దీనిని రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకుని ఈదుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైందన్నారు. విద్య, వైద్యం ప్రైవేటీకరించడం వలన సామాన్యులకు అవి భారంగా మారాయన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్ సేవలో తరిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం కొరకు విజయవాడలో నవంబర్ 15న సిపిఎం ప్రజారక్షణభేరి బహిరంగ సభ నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా ప్రజారక్షణ భేరీ బస్సు యాత్ర నవంబర్ 7న డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా లో పర్యటిస్తుందన్నారు.రావులపాలెం, అమలాపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ 15న విజయవాడలో జరిగే బహిరంగ సభకు జిల్లానుండి వేలాది మంది తరలి వెళ్లేందు సన్నద్ధం అవుతున్నామన్నారు. పార్టీ కార్యక్తలు అంతా ఈ కార్యక్రమం జయప్రదానికి కృషి చేయాలన్నారు. ఈ ప్రచారజాతా అమలాపురం, ఉప్పలగుప్తం, కాట్రేనుకోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం తదితర మండలాలో పర్యటించింది.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు జి.దుర్గా ప్రసాద్, పీతల రామచంద్రరావు, టి.నాగవరలక్ష్మి నాయకులు వి.మోహనరావు, పాము బాలయ్య, బీమాల శ్రీను, కె.సత్తిబాబు, సఖిలే సూర్యనారాయణ, తాడి శ్రీరామూర్తి, లక్ష్మణ్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.