Nov 08,2023 21:15

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు శంకరరావు

ప్రజాశక్తి - వంగర : ఈ నెల 15న విజయవాడలో జరగనున్న సిపిఎం ప్రజా రక్షణ బేరి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శంకర్రావు పిలుపునిచ్చారు. బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ వంగరలో బుధవారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలి అభివృద్ధిని గాలికి వదిలేసిన పరిస్థితి ఉందన్నారు. వీటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో ప్రజా పోరాటాలకు ప్రజానీకాన్ని సిద్ధం చేసేందుకు, అసమానతలు లేని అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం, సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరీ బస్సు జాతాలను, బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 బస్సు జాతలను నిర్వహిస్తుందని, దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కలవరపరుస్తున్నాయని ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించవ లసిన కాలం వచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తి కావస్తున్నా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్‌, విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనక బడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు లాంటి విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేతకాక వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు జపం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడిలకు, ఆశాలకు, గ్రామ సేవకులు, విద్యుత్తు, పంచాయతీ మున్సిపాలిటీ, కాంట్రాక్ట్‌, ఔట్స్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు చేసిన వాగ్దానాలు గాలికి ఎగిరిపోయాయన్నారు. వీటిపై ఉద్యమానికై చేపడుతున్న ప్రజారక్షణ బేరి బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామ్మూర్తి నాయుడు, పి. విశ్వనాథం, అప్పలనాయుడు, ఆదినారాయణ, రామారావు, వెంకట నాయుడు, త్రినాధ తదితరులు పాల్గొన్నారు.