Nov 03,2023 21:37

సామూహిక సీమంతాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘురాజు

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  గ్రామాల్లో అధికారులు కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సూచించారు. శుక్రవారం ఎంపిడిఒ కార్యాలయ సమావేశ భవనంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, విద్యుత్తు, వైద్య ఆరోగ్య, ప్రజా రవాణా, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్‌, విద్య తదితర శాఖల పనితీరుపై సమీక్షించారు. మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఎంపిడిఒ శేషుబాబు, కొట్టాం పిహెచ్‌సి వైద్యాధికారి జుత్తాడ హారిక, ఇఒపిఆర్‌డి లక్ష్మిని సన్మానించారు. సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యులు మమ్ములూరి వెంకటలక్ష్మి, వైస్‌ఎంపిపిలు ఇందుకూరి సుధారాజు పాల్గొన్నారు.
సామూహిక సీమంతాలు
మండల కేంద్రంలోని ప్రయివేటు కళ్యాణ మండపంలో జగతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోందన్నారు. ప్రభుత్వం గర్భిణులకు ప్రత్యేక కిట్లు పంపిణీ చేయడంతో వీటిలో ఉండే పోషకాహారం ద్వారా పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. సంస్థ అధ్యక్షులు, వైస్‌ ఎంపిపి ఇందుకూరి సుధారాజును, సంస్థ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు, జెడ్‌పిటిసి ఎం.వెంకటలక్ష్మి, సంస్థ అధ్యక్షులు ఇందుకూరి సుధారాజు, గౌరవాధ్యక్షులు, కొత్తవలస జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, ఎస్‌.కోట మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ జి.సంతోషికుమారి, రాష్ట్ర హింది అకాడమీ డైరక్టర్‌ గుమ్మడి స్వాతిరత్నం, ఎల్‌.కోట వైస్‌ ఎంపిపి ఆవాల శ్యామల, వేపాడ స్వప్న, తదితరులు పాల్గొన్నారు.