ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగే ప్రజా సంక్షేమ, అభివృద్ధి, అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపిటిసిలకు ప్రాధాన్యత ఇచ్చి భాగస్వామ్యం కల్పిస్తామని గోనెగండ్ల ఎంపిపి నసురుద్దీన్, తహశీల్దార్ వేణుగోపాల్, ఎంపిడిఒ నగేష్ తెలిపారు. శుక్రవారం ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో గోనెగండ్ల మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు వల్ల నేరుగా అధికారులకే లబ్ధి అందజేస్తున్నందున స్థానిక ప్రజా ప్రతినిధులైన తమకు ప్రాధాన్యత కొరవడిందని కొంతమంది సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి, అధికారులు మాట్లాడారు. ఆయా గ్రామాల పరిధిలో జరిగే ప్రజా సంక్షేమ, అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలకు ఎంపిటిసిలు, సర్పంచులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్వహించేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.
స్వచ్ఛభారత్ కార్మికులకు వేతనాలు చెల్లించాలి
గోనెగండ్ల మేజర్ పంచాయతీలో పని చేస్తున్న స్వచ్ఛభారత్ పారిశుధ్య కార్మికులకు గత కొన్ని నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే వేతనాలు చెల్లించాలని సర్వసభ్య సమావేశంలో వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసిపి యువజన నాయకులు టి.బందే నవాజ్ మాట్లాడారు. గ్రామంలో పారిశుధ్య పనులు చేసి పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు నెలల తరబడి వేతనాలు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే వారికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైస్ ఎంపిపి వెంకటరామిరెడ్డి, ఎర్రబాడు కాశీరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.
వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు










