
ప్రజాశక్తి-సామర్లకోట రూరల్
కలకలం సృష్టించిన వేట్లపాలెం పంచాయతీలో రూ.కోట్ల నిధులు దుర్వినియోగం కేసులో ఇప్పటికే అరెస్టు చేసి కోర్టుకు పంపిన అయిదుగురికి కాకినాడ కోర్టు మేజీస్ట్రేట్ ఈ నెల 20వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. తప్పించుకు తిరుగుతున్న మరో ఆరుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు సిఐ కె.దుర్గాప్రసాద్ తెలిపారు. మొత్తం 11 మందిని నిందితులుగా గుర్తించగా, ఇప్పటికే ఈ కేసులో వేట్లపాలెం సర్పంచ్ చిల్లి వెంకటలక్ష్మి, ఆమె భర్త చిల్లి మోహనరావు, మాజీ సర్పంచ్ భర్త, మాజీ ఉప సర్పంచ్ వల్లూరి శ్రీనివాసరావు, పంచాయితీ జూనియర్ అసిస్టెంట్ నామ వీరాంజనేయులు, సిబ్బంది కప్పగంతుల లక్ష్మి సూర్యకళ అరెస్టు అయ్యారు. సుమారు రూ.3.46 కోట్ల అవినీతి వేట్లపాలెం పంచాయితీలో వెలుగు చూడడం సంచల నంగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు నిధుల దుర్వినియోగం బయట పడడం గమనార్హం. ఈ ఏడాది జులై 7న కాకినాడ డివిజనల్ పంచాయతీ అధికారి అమ్మాని సామర్లకోట పోలీసు స్టేషన్‌లో కలెక్టర్ ఆదేశాల మేరకు నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం కావడంతో జిల్లా కలెక్టర్ పంచాయతీ సర్పంచ్ వెంకటలక్ష్మి చెక్ పవర్‌ను రద్దు చేసి తాత్కాలికంగా సామర్లకోట ఎంపిడిఒ డి.శ్రీలలితకు అప్పగించిన విషయం పాఠకులకు విదితమే.
ఈ కేసులో మిగిలిన వారిని అరెస్టు చేయకుండా ఉన్నత స్ధాయిలో పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకుల ద్వారా మిగతా వారు అరెస్టు కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెల్సింది.
తప్పు బిల్లులతో నిధుల దుర్వినియోగం
గత పంచాయతీ పాలనలోనూ, ప్రస్తుత పంచాయతీ పాలనలో తప్పుడు బిల్లులు సృష్టించి పంచాయతీ నిధులను స్వాహా చేసినట్టు తెలుస్తోంది. నిర్మించిన సిసి రోడ్లపైనే మళ్లీ సిసి రోడ్లు నిర్మించినట్టు, పారిశుధ్యానికి ఉపయోగించే వాహనాలు సామగ్రిని అధిక శాతం కొనుగోలు చేసినట్టు, పంచాయతీ పరిధిలోని ఇంటి పన్నులు, కొళాయి పన్నులు వసూలు చేసి వాటిని పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా స్వాహా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సొమ్ముతో కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం వంటి నగరాల్లో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.