Feb 01,2023 23:03

ప్రజాశక్తి-విజయవాడ: అప్రజాస్వామిక పద్దతిలో, అత్యంత నిరంకుశంగా అధికార వైసిపి మంగళవారం విఎంసి కౌన్సిల్‌ను నిర్వహించిందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌ విమర్శించారు. స్థానిక శ్రీశ్రీ భవన్‌లో సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబుతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అజెండాలో నగరాభివృద్ది, నిధులు, ప్రజలకు సంబంధించిన అంశాలపై కనీస చర్చకు కూడా తావివ్వకుండా, విపక్ష సభ్యుల గొంతు నొక్కి ఏకపక్షంగా వందల అంశాలతో కూడిన అజెండాను నిమిషాల వ్యవధిలో ఆమోదించుకున్నారన్నారు. నగర వ్యాప్తంగా నాలుగు వేల మందికి నోటీసులు జారీ చేసి రెండు వేల పింఛన్లు తొలగించిన వాటిపై సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు అజెండాలో ప్రత్యేక అంశంగా తీసుకొచ్చి మాట్లాడబోతుండగా ఆయనకు మద్దతునిచ్చిన టిడిపి సభ్యులను సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. విపక్షాలను మాట్లాడనీయకుండా నోరు నొక్కడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కమ్యూనిస్టుల పాలనలో విజయవాడ నగర తొలి మేయర్‌గా పని చేసిన టి.వెంకటేశ్వరరావు వద్దకు అనేక మంది మేయర్లు, చైర్మన్లు పురపాలనపై అవగాహన పెంచుకునేందుకు శిక్షణ కోసం వచ్చే వారని తెలిపారు. ప్రస్తుత మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ తన స్వతంత్రను కోల్పోయి, ఎమ్మెల్యేల కనుసైగల నడుమ కౌన్సిల్‌ను అప్రజాస్వామిక, నియంతృత్వ పద్దతుల్లో నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఫుడ్‌కోర్టులో భారీ మొత్తంలో జరుగుతున్న అవినీతి అక్రమాల నేపధ్యంలో సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ వైసిపిని నిలదీయగా, ఆయనకు మద్దతుగా అధికారపక్షం సీనియర్‌ సభ్యులు బొల్లా విజరుకుమార్‌ నిలిచి ఫుడ్‌కోర్టులో లక్షలు, కోట్లు చేతులు మారుతున్నాయని, పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, తాను రుజువు చేస్తానని కౌన్సిల్‌లో సవాల్‌ చేసినా వైసిపి మిన్నకుండి పోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో అధికార వైసిపి దౌర్జన్యాలను తేల్చుకుంటామని హెచ్చరించారు. సత్యబాబు మాట్లాడుతూ కౌన్సిల్‌లో తన పట్ల అధికార వైసిపి దుర్మార్గంగా వ్యవహరించి, బలవంతంగా బయటకు గెంటేసిందని అన్నారు. అధికార పక్షం ఆగడాలను ప్రజలకు వివరించి, సమస్యల పరిష్కారానికి పోరాడతానన్నారు.