Jan 25,2023 00:19

స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాల్లో ప్రచారం నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు

ప్రజాశక్తి-యంత్రాంగం
ఉక్కునగరం :ఉక్కు త్రిష్ణా గ్రౌండ్‌లో ఈ నెల 30వ తేదీన జరిగే ఉక్కు ప్రజా గర్జన బహిరంగ సభలో ఉక్కు కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఎల్‌ఎంఎంఎం పార్కు వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. స్టీల్‌ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లో ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న స్టీల్‌ప్లాంటను ఎట్టిపరిస్థితిలోనూ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఒవి రావు, జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, బొడ్డ గోవిందు, పిట్టా రెడ్డి, మురళీకృష్ణ, సత్యారావు, త్రినాథ్‌రెడ్డి, గురునాధ్‌రెడ్డి, డి.పాండే, కె.సత్యవతి, యు.సోమేష్‌, పి.మసేను, చట్టి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
తగరపువలస :ఉక్కు ప్రజా గర్జనను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ భీమిలి ఏరియా సమితి ఆధ్వర్యాన మంగళవారం స్థానిక జంక్షన్‌లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఉక్కు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి రెండేళ్లు అవుతున్న సందర్భంగా చేపట్టే కార్మిక గర్జనను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్య వర్గ సభ్యులు ఎస్‌కె రెహమాన్‌, జిల్లా నాయకులు అల్లు బాబూరావు, ఎమ్‌డి బేగం, వి.సత్యనారాయణ, కానూరి రాంబాబు, ఎం.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెంటనే రద్దుచేయాలని ఎఐటియుసి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీతమ్మధార అల్లూరి సీతారామరాజు జంక్షన్‌ వద్ద ఎఐటియుసి ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా కార్యదర్శి జి.వామనుమూర్తి, సిపిఐ జిల్లా సభ్యులు పడాల గోవింద్‌ మాట్లాడుతూ, ప్రజాగర్జనలో కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బిజెపి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రావికృష్ణ, ఆర్‌.అశోక్‌, నక్క సూర్యనారాయణ, బి.దుర్గారావు, పి.రాము తదితరులు పాల్గొన్నారు.