Oct 29,2023 22:56

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి - సాలూరు : టిడిపి ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాధనం దోపిడీ చేయడం వల్లనే జైల్లో పెట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసిపి ప్రజాసాధిక బస్సు యాత్ర విజయవంతం చేయడానికి ఆదివారం స్థానిక బైపాస్‌ రోడ్డులో డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం గురించి వివరించడానికి బస్సు యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. నవంబర్‌ 8న పట్టణంలో సామాజిక సాధికారత సభ, 9న రాష్ట్రానికి జగన్‌మోహన్‌ రెడ్డి ఎందుకు కావాలో సచివాలయాల పరిధిలో సభలు నిర్వహించాలని కోరారు. ఈ సభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగన్‌ నాయకత్వంలో మాత్రమే బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగిందని తెలిపారు. గిరిజన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సిఎం పదవులిచ్చిన సిఎం జగన్‌ అని చెప్పారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. జన్మభూమి కమిటీలతో టిడిపి దోపిడీ పాలన సాగించిందని చెప్పారు. గడచిన నాలుగేళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వ హయాంలో పేదలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో రూ.1200 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు జరిగాయని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి 50రోజులైతే టిడిపి నాయకులు, కార్యకర్తలు రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరి పైన ఒత్తిడి పెంచుతారనీని ప్రశ్నించారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర నాయకత్వంలో వైసిపిని మళ్లీ గెలిపించాలని కోరారు. జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ నకిలీ గిరిజన నాయకుల పాలనలో ఈ నియోజకవర్గం చాలా కాలం సాగిందని చెప్పారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర నాయకత్వంలో నిజమైన గిరిజన నాయకుడికి పట్టం కట్టారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో గతం కంటే భారీ మెజారిటీతో వైసిపి విజయం సాధిస్తుందన్నారు. మన్యం జిల్లా అధ్యక్షులు ఎస్‌.పరీక్షిత్‌ రాజు మాట్లాడుతూ సిఎం నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజారంజకంగా పాలన సాగిస్తోందని అన్నారు. వైసిపికే ప్రజలు మళ్ళీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర మాట్లాడుతూ టిడిపి హయాంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప జరిగిందేమీ లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై తాను ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమేనన్నారు. ఇప్పటికే వందసార్లు చర్చకు రావాలని టిడిపి నాయకులకు సవాల్‌ విసిరానని, కానీ చర్చకు రాలేదని చెప్పారు. వచ్చేనెల 8న జరుగనున్న బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. గతంలో జగన్‌ పాదయాత్ర సందర్భంగా జరిగిన సభ కంటే ఎక్కువ సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు వి.శ్రీనివాసరెడ్డి, మక్కువ మండల సీనియర్‌ నాయకులు శ్రీనివాసరావు నాయుడు, రంగు నాయుడు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంతకుమారి, సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ పాల్గొన్నారు.
సభాస్థలం పరిశీలించిన జెడ్పీ చైర్మన్‌, మంత్రి
వచ్చేనెల 8న జరగనున్న వైసిపి సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభకు స్థలాన్ని ఆదివారం సాయంత్రం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, డిప్యూటీ సిఎం రాజన్నదొర పరిశీలించారు. బోసుబొమ్మ జంక్షన్‌లో సభ ఏర్పాటుపై పట్టణ, మండల నాయకులతో చర్చించారు. ఆరోజు సభ నిర్వహణ సమయంలో ట్రాఫిక్‌ నియంత్రణ గురించి టౌన్‌ సిఐ శ్రీనివాసరావుతో మాట్లాడారు. పట్టణ వైసిపి అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు వారి వెంట ఉన్నారు.