Jun 06,2021 06:58

    నిజమైన ప్రజాస్వామ్యం...ప్రజాభిప్రాయం మీదనే ఆధారపడి వుంటుంది. అందుకే- 'ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు' అన్నారు. కాబట్టే ప్రజాభిప్రాయానికి అధిక ప్రాముఖ్యత వుంటుంది. ప్రభుత్వ విధానంలో మార్పులు తీసుకొని రావడానికి, తద్వారా ప్రజలను ఏకం చేయడానికి ప్రజాభిప్రాయం ఉపయోగపడుతుంది. వాస్తవానికి, ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏమిటో కూడా చాలామందికి తెలియదు. తెలిసినా పట్టించుకోరు. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ఈ మార్గం...నియంతృత్వం, ఫాసిస్టు ధోరణి నరనరానా జీర్ణించుకుపోయిన పాలకులకు రుచించదు. ప్రజల మనోభావాలను పట్టించుకోరు. 'ఇది నా మాట... నా మాటే శాసనం' అన్నట్లుగా...ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా తమ అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతారు. ఇది ప్రజాస్వామ్య విధానానికి గొడ్డలి పెట్టు.
    'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే విధానమే ప్రజాస్వామ్యం' అని అబ్రహం లింకన్‌ అంటారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు, పాలకులు...ప్రజా సంక్షేమం కోసమే పని చేయాలి. అంతే తప్ప...ప్రజలు ఇదే కోరుకుంటున్నారని నేతలే కొన్ని నిర్థారణలకు వచ్చేసి, ప్రజలపై తమకేదో హక్కు వున్నట్లు...తామే యజమానుల మన్నట్లు వారికి తోచిందే చేస్తారు. బలవంతంగా ప్రజలపై రుద్దుతుంటారు. తాజాగా నెల్లూరు ఆనందయ్య నాటుమందును ప్రజలందరూ కోరుకుంటున్నారని ప్రచారం చేశారు. ఎంతమంది ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకున్నారు? ఎవరు సేకరించారు? అనేవి సమాధానం లేని ప్రశ్నలు. కోవిడ్‌ మహమ్మారి బారిన పడిన ప్రజలకు తగిన వైద్య సౌకర్యాలు అందించలేని పాలకులు...తమ అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి ఇది సాకుగా ఉపయోగపడింది. ప్రచారాన్ని నమ్మిన కొద్దిమంది అక్కడ పోగయ్యారు. దానికి సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించారు. రాష్ట్రంలోని 90 శాతం మంది ప్రజలు దీనిపై మౌనంగానే వున్నారు. మౌనం అర్థాంగీకారం అనుకున్నారా? మౌనంగా వున్న వారు ప్రజలు కాదా? వారికి అభిప్రాయాలు వుండవా? లేక మౌనంగా వున్నారు కాబట్టి తమకు నచ్చిన వక్రభాష్యాలు అచ్చేసుకోవచ్చు అనుకున్నారా? ఈ వాదన ప్రకారమే అయితే... నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్య చేస్తే...ఎందరు మాట్లాడుతున్నారు? ఎవరూ మాట్లాడలేదు కాబట్టి ఆ హత్య సక్రమమైపోతుందా? ఇది ప్రజాభిప్రాయం అంటే చట్టం అంగీకరిస్తుందా? అన్ని వేళలా మౌనాన్ని అర్థాంగీకారం అని అనుకోలేము. ఒక్కోసారి అది తుఫాను ముందు నిశ్శబ్దం లాంటిది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ప్రజలు మౌనంగా భరించారు. తర్వాత ప్రజా తీర్పునకు వెళితే, నిశ్శబ్దం కాస్తా ఉప్పెనయింది. ఇందిర నిర్ణయం తప్పు అని తేల్చిన ప్రజలు అధికారం నుంచి తప్పించారు. అలాగే... మెజారిటీ హిందువులు రామాలయం కోరుకున్నారని బిజెపి చెప్పింది. ప్రజలు కోరుకుంటున్నారని, ఇది ప్రజల అభిప్రాయమని ముందే ప్రకటించేసి, తాము అనుకున్నదే చేశారు. మసీదును కూల్చి రామాలయం కట్టాలని-ఎంతమంది అభిప్రాయం తీసుకున్నారు? కనీసం హిందువుల్లోనైనా అందరినీ అడిగారా? లేదు. అక్కడ రామాలయం నిర్మించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంది. దాన్ని బిజెపి అమలుపర్చింది. ఇక్కడ ప్రజాభిప్రాయం మచ్చుకైనా లేదు.
    తమ సొంత అభిప్రాయాలను యావన్మంది ప్రజలపై రుద్దే ప్రయత్నం నిరంకుశత్వం. వాళ్లు అనుకున్నదాన్ని ప్రజలపై రుద్దడానికి ప్రజాభిప్రాయం అనే ముసుగు వేసి...ప్రజల ఆహారపుటలవాట్లు, వేష, భాషలపై, ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడ్డారు. తిరిగి...మన సంస్కృతీ సంప్రదాయాలపైన, ఆచారాలపైన దాడి జరిగిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి ఇది మన ప్రాచీన సంస్కృతి అని, ఇవి మనోభావాలు అని, అవి గాయపడ్డాయని ఎవరు నిర్ణయించారు? ఎవరు అంగీకరించారు? ఎవరు తిరస్కరించారు? ప్రజలెన్నుకున్న ప్రతినిధులతో ఏర్పడే పార్లమెంటును గాని, మనకందరికీ శిరోధార్యమైన రాజ్యాంగాన్ని గాని తోసిరాజంటూ ఇంకోపక్క ప్రజాభిప్రాయం అని, ప్రజల మనోభావాలు అని మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే ఫాసిస్టు శక్తుల ప్రచార వ్యూహం. ఆ సంగతి ప్రజలకు బోధపడిన రోజు ఫాసిస్టు పాలనకు మరణ శాసనమే.