ప్రజాశక్తి-మాడుగుల: కలర్ గ్రానైట్ అనుమతుల కోసం ఈనెల 16న కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పండగ రోజున సమాచారం లేకుండా హడావిడిగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం దుర్మార్గమని, దీన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కార్లి భవాని డిమాండ్ చేశారు. సోమవారం శీతలబంద, గొర్రెగడ్డ తదితర ప్రాంతాలలోని గ్రానైట్ క్వారీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కనీసం గ్రామాలలో దండోరా కూడా వేయకుండా రహస్యంగా జరపడం అన్యాయమని విమర్శించారు. ఇప్పటికే గ్రానైట్ తవ్వకాల కారణంగా చుట్టుపక్కల అనేక గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటాయని, కాలుష్యం విపరీతంగా పెరిగి పోయిందని తెలిపారు. చుట్టుపక్కల అనేక గ్రామాలలో భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయని తెలిపారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే తవ్వకాలు జరపాలనే నిబంధన ఉందని, కనీసం 200 మీటర్లు కూడా దూరం లేకుండా తవ్వకాలు చేపట్టడం అన్యాయమన్నారు. మాడుగుల మండలం మైనింగ్ జోనుగా గుర్తింపు పొందిందని, అక్రమాలతో అనుమతులు పొంది ఇష్టానుసారంగా మైనింగ్ కార్యకలాపాలు ఈ ప్రాంతంలో జరుగు తున్నాయన్నారు. దీంతో వందలాది గిరిజన కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు. ఈ కారణంగా రహదారులు నాశనం అవుతున్నాయని, అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మైనింగ్ కార్యకలాపాల కారణంగా భవిష్యత్తులో మండలంలోని అనేక గ్రామాలు సర్వనాశనం అవ్వడం ఖాయమని అన్నారు. మైనింగ్ కారణంగా అనేక గ్రామాలలో పొల్యూషన్ సమస్య వచ్చిందని, అనేకమంది వివిధ వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించకపోతే అనేక గిరిజన గ్రామాలు సర్వనాశనం ఖాయమన్నారు. ఈ ప్రాంతం ఎడారిగా మారకముందే ఈనెల 16న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.










