Nov 05,2023 22:18

ప్రజాభేరికి అపూర్వ ఆదరణ కరువునుంచి గట్టెక్కించండి

ప్రజాభేరికి అపూర్వ ఆదరణ
కరువునుంచి గట్టెక్కించండి
సిపిఎం ప్రజాభేరి యాత్రలో ప్రజల విన్నపాలు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
శాశ్వత నీటి ప్రాజెక్టులు లేవు. వర్షాధారమే ఆధారం. ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రమే. వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. చాలాచోట్ల విత్తనాలు వేయకుండా నిలిపేశాం. కరువు నుంచి గట్టెక్కించాలి' అంటూ ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజలు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు సిపిఎం ప్రజా రక్షణ భేరితో బస్సు యాత్ర జిల్లాలో సాగింది. ఈ యాత్రకు కర్నూలు మాజీ ఎంఎల్‌ఎ, సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ నాయకత్వం వహించారు. రాష్ట్ర కార్యవర్గసభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.క్రిష్ణయ్య, కె.ఉమామహేశ్వరరావు, ఎం.భాస్కరయ్య, రాష్ట్ర నాయకులు దయా రమాదేవి, శివ నాగరాణితో పాటు ఉమ్మడి జిల్లా కార్యదర్శులు వాడ గంగరాజు, వందవాసి నాగరాజు పాల్గొన్నారు. బస్సు యాత్ర ఆద్యంతం కరువు ఛాయలే ఈ బృందానికి కనిపించాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజలు కరువు నుంచి తమను గట్టెక్కించాలని, పశువులకు మేత లేదని, పాడి పరిశ్రమ ఆధారంగానే జీవిస్తున్నామని విన్నవించారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, ఎస్‌ఎస్‌ కెనాల్‌ పూర్తి చేస్తామని చెప్పిన పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. ప్రతిసారీ ఎన్నికల్లో ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఓట్లు దండుకుంటారు. అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరిస్తున్నారు. శాశ్వత నీటి పరిష్కారం లభిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు. వ్యవసాయం చేసుకుని బతుకుతాం. వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది.
ఎన్నికలకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చిన పలమనేరు టెక్స్‌టైల్‌ పార్కు హామీకే పరిమితమయ్యింది. టమోటా, నిమ్మ, మామిడి కోల్డ్‌ స్టోరేజీలు మాటలకే పరిమితం. మన్నవరం భెల్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలిపోయింది. సిఆర్‌ఎస్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అడ్రస్‌ గల్లంతయ్యింది. టిటిడి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు రెగ్యులర్‌ చేస్తామని చెప్పిన హామీని విస్మరించారు. తిరుపతి నగరాభివృద్ధికి టిటిడి బోర్డు నిర్ణయించిన ఒక్క శాతం నిధులకు బిజెపి మోకాలడ్డుతోంది. సిలికాన్‌ అక్రమ తవ్వకాలు కార్పొరేట్ల వశమయ్యాయి. మత్స్యకారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కాలేదు. సిలికాన్‌, హోండా, హీరో, అపోలో, శ్రీసిటీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న ప్రభుత్వ జీవో అమలు కాలేదు. సెక్యూరిటీ, వాచ్‌మెన్‌లు, అటెండర్లకే పరిమితమయ్యాం. గ్రామ పంచాయతీ కార్మికులకు 15 ఏళ్లుగా 8వేల జీతంతో బతుకుతున్నాం. పెంచిన పాపాన పోలేదు. తెలంగాణా కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీ ఊసేలేదు. ఇప్పటికీ మా జీతం 11వేలే. తెలంగాణాలో 13వేలు. మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. డప్పు కళాకారులకు ఎర్రజెండా పక్షాన పోరాడి సాధించిన పింఛన్‌ మూడువేలు. ఐదువేలు ఇవ్వాలి. ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒపిఎస్‌ అమలు చేయాలి. యాప్‌ల భారంతో వేధింపులు ఎక్కువయ్యాయి. జగనన్న ఇళ్లు పూర్తి చేసి సంక్రాంతి లోపు గృహప్రవేశాలు కల్పించాలి.
- జాతీయ విద్యా విధానం పేరుతో ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రాథమిక పాఠశాలలను జి ఓ 117 పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని. ఈ జీవోను రద్దు చేయాలన్నారు.గూడూరులో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయకపోవడంతో ఉపాధ్యాయులపై పని భారం ఎక్కువ అవుతుందన్నారు.
డీఎస్సీ ద్వారా నియామకం చేయ డానికి కషి చేయాలని యూటీఫ్‌ నాయకులు కోరారు.
ప్రజాశక్తి - శ్రీకాళహస్తి/రేణిగుంట /గూడూరు
రాష్ట్రంలో భూకబ్జాల పాలన సాగుతోందని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అవకాశవాద అబద్దాల ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని 'సిపిఎం ప్రజా రక్షణ భేరి' రాష్ట్ర బృందం ఉద్ఘాటించింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొనసాగుతున్న దుర్మార్గపాలనను ఎండగడుతూ నవంబర్‌ 15న విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. బస్సు యాత్ర ఆదివారం ఉదయం తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు మీదుగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. డప్పులతో అడుగడుగునా ఈ యాత్ర బందానికి ప్రజలు, ప్రజా సంఘాలు, సిపిఎం కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్సీ, ఎస్టీలు, పంచాయతీ కార్మికులు, స్కీం వర్కర్లు వినతుల రూపంలో విన్నవించారు. రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరుల్లో జరిగిన సభల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని, ఎటుచూసినా కరువు విలయతాండవం చేస్తోందన్నారు. జగన్‌ ప్రభుత్వంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను ఎంచక్కా ఆక్రమించుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటూ కోట్లు దండుకుంటున్నారన్నారు. ఒక్కో ఎంఎల్‌ఎ రూ.200 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకూ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని, పేద ప్రజలకు జానెడు ఇంటి స్థలం ఇచ్చేందుకు వారికి మనస్సు రావడం లేదన్నారు. తప్పును ప్రశ్నిస్తే అధికార పార్టీ కంటే ముందు పోలీసులే ఓవరాక్షన్‌ చేస్తూ వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, ప్రజలు శాశ్వతమనే విషయాన్ని పోలీసులు గుర్తించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ కెనాల్‌ దశాబ్దాలుగా సాగుతూనే ఉందన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ దోచుకోవడం దాచుకోవడం తప్ప, ప్రజా సమస్యలు ఆయనకు పట్టడం లేదని మండిపడ్డారు. గూడూరు నియోజకవర్గంలో పేదలకు భూపట్టాలిచ్చిన భూములు పెత్తందారుల చేతుల్లో ఉన్నాయని, ఇప్పటికైనా ఎంఎల్‌ఎ, ఎంపి స్పందించి పేదల భూములు పేదలకు అప్పగించాలన్నారు. తిరుపతి అభివృద్ధికి టిటిడి బోర్డు ఒక్కశాతం నిధులు ఇస్తామని తీర్మానిస్తే బిజెపి మోకాలడ్డుతోందన్నారు. గూడూరు నియోజకవర్గంలో సిలికాన్‌ను అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ యాత్రలో నాయకులు అంగేరి పుల్లయ్య, జనార్ధన్‌, టి సుబ్రమణ్యం, ఓ వెంకటరమణ, ఎస్‌ జయ చంద్ర, హరినాథ్‌, సెల్వరాజ్‌, రాజేశ్వరి, బుజ్జి, వేణు నరసింహారెడ్డి, గంథం మణి, పెనగడం గురవయ్య, పద్మనాభయ్య, చెంగయ్య, రమేష్‌, రాపూరు సుబ్రమణ్యం, సంక్రాంతి వెంకటయ్య, గూడూరులో శాఖ కార్యదర్శి జోగి శివకుమార్‌, నాయకులు బివి రమణయ్య, సురేష్‌, బి.చంద్రయ్య, మణి, అడపాల ప్రసాద్‌, గోపి, ఆర్‌.శీనయ్య పాల్గొన్నారు.
రేణిగుంటలో... అంబేద్కర్‌ విగ్రహం వద్ద స్వాగతం పలికారు. ఇక్కడి సభకు మండల కార్యదర్శి కె.హరినాథ్‌ అధ్యక్షత వహించారు. సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు, మాజీ ఎంఎల్‌ఎ ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజా రక్షణ భేరి యాత్ర సాగుతోందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటం వల్ల మణిపూర్‌లో మహిళలకు రక్షణ లేదని, ముస్లీం, క్రిష్టియన్స్‌ మత బోధన మసీదులు, చర్చిలపై విశ్వ హిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి అనుబంధ సంస్థలు దాడులు చేస్తున్నాయన్నారు. ప్రజలందరూ చైతన్యం కలిగి బిజెపి మతోన్మాద, నిరంకుశ పాలనను ఓడించాలని పిలుపునిచ్చారు. గువ్వలకాలనీ ఇళ్లు కాపాడాలని గిరిజన నాయుడు అలీబాబా వినతిపత్రం సమర్పించారు.