ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
నిరుద్యోగం, అధిక ధరలు అరికట్టాలని సిపిఎం చేపట్టిన సమరభేరి 'వాల్‌పోస్టర్‌ను' సిపిఎం కార్యాలయంలో నగర కార్యదర్శి పి.కిషోర్, నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం అఖిల భారత కమిటీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిందన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజిల్, గ్యాస్, కరెంటు చార్జీలు నిత్యం పెంచుతూనే ఉందన్నారు. బిజెపి అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజిల్ రూ.40, 50 ఉండేవి, ఇప్పుడు రూ.110 పెరిగిందన్నారు. కరెంటు రూ.300, 400 బిల్లు వచ్చేది, నేడు రూ.వెయ్యా, రెండు వేలు వస్తుందన్నారు. గ్యాస్ బండ ధర రూ.450 ఉండేది నేడు రూ.1,200 పెరిగిందన్నారు. ఈ రకంగా ప్రజలపై అధిక ధరలు మోపి బిజెపి అధాని, అంబానీ వంటి కార్పోరేట్ సంస్థలకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇస్తుందని విమర్శించారు. మోడీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని, కనీసం రెండు లక్షలు ఉద్యోగాలు కూడా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రెయివేటీకరణ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అధిక ధరలు, నిరుద్యోగం, అసమానతలపై ప్రశ్నిస్తుంటే దీన్ని దారిమళ్లించడానికి దేశంలో కుల, మత ఘర్షణలు రేపుతున్నారని తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి మణిపూర్, హర్యానా, కర్ణాటక, కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో మతకలహాలు సృష్టించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. 'ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు' అని పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రెయివేటు వారికి అమ్మేస్తుందన్నారు. ఇంతచేస్తున్న బిజెపికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి వీటితో పాటు జనసేన వత్తాసు పలుకడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఈ కుటిల రాజకీయాలకు వ్యతిరేకంగా తిరగబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, మాఊరి శ్రీనివాస్, ఎం.ఇస్సాక్, మీసాల సత్యనారాయణ, ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు.










