Aug 09,2023 22:11

ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించారు. కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తిప్పికొట్టాలని కోరారు. బిజెపి దేశంలో అధికారం చేపట్టిన తర్వాత కార్పొరేట్లకు దాసోహమై కార్మికులను, రైతులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రైతులు పండించే పంటలపైన కార్పొరేట్లకు పెత్తనం అప్పజెప్పి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు బిజెపి కారణమైందని విమర్శించారు. కార్మికుల హక్కులు హరించే విధంగా చట్టాలను మార్చి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్‌ మత చిచ్చు రేపి, అక్కడ ఉన్న గిరిజన ప్రాంతంలో ఖనిజాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని కుట్ర పన్నిందని మండిపడ్డారు. అందులో భాగంగానే మహిళలను నగంగా ఊరేగించడంతో దేశ ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల పంటలకు మద్దతుధర లేదని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయడం లేదని తెలిపారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ నాయకత్వంలోని బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి దావాల రమణారావు, యమ్మల మన్మథరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు, ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు, ఎఐకెఎంఎస్‌ నాయకులు రమణి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు బొత్స నర్సింగరావు, ఎఐటిఎఫ్‌ నాయకులు దుర్గమ్మ, ఐఎఫ్‌టియు నాయకులు సర్వేశ్వరరావు, అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకులు పి.సంగం, ఎఐసిసి నాయకులు దామోదర్‌, సిఐటియు నాయకులు బి.వి.రమణ, గేదెల సత్యనారాయణ, బంకుర సూరిబాబు, రాము, వెంకటరమణ, శాంతి, తదితరులు పాల్గొన్నారు.