Aug 30,2023 22:28

శ్రీకాకుళం : ప్రచారం చేస్తున్న సిపిఎం నాయకులు

* పలుచోట్ల సంతకాల సేకరణ
* 4న మండల కేంద్రాల్లో ధర్నా
* సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం యంత్రాంగం: 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన సమరభేరి కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంతకాల సేకరణ, కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం నగరంలోని పలు వార్డుల్లో సంతకాల సేకరణ, ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ సమరభేరిలో భాగంగా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 4న అన్ని మండల కార్యాలయాల వద్ద చేపట్టే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ పాల్గొంటారని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో, అధిక ధరలు అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. మోడీ ప్రభుత్వానికి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు తప్ప దేశ ప్రజల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజానీకం జీవనం కష్టంగా మారిందన్నారు. 2014లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం, ఉద్యోగాలు ఇవ్వలేదు సరే కదా పరిశ్రమలు మూతపడి లక్షలాదిమంది ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రజలపై పన్నుల భారాల మోపుతూ, కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీ ఇస్తోందని విమర్శించారు.
ఎన్నికలకు ముందు విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, ఆ హామీని గాలికొదిలేసి ఏడుసార్లు పెంచారని చెప్పారు. ఇప్పుడు నెలవారీ పెంపుదలకు రంగం సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. కేరళ తరహాలో జీడి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.నాగమణి, పి.తేజేశ్వరరావు, టి.తిరుపతిరావు, అమ్మన్నాయుడు, ఎ.మహాలక్ష్మి, ఎ.సత్యం, ఎం.గోపి, కె.సూరయ్య, కె చంద్రశేఖర్‌, పాణి గ్రహణం, బి. సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు మండల కేంద్రంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్‌, నిమ్మక అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
పలాసలో తిలక్‌నగర్‌, సూదికొండ తదితర వార్డులలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఎన్‌.గణపతి, ఎన్‌.ఢిల్లేశ్వరి, భాగ్యలక్ష్మి, ఎం.లావణ్య పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరులో చేపట్టిన సమరభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్‌ ఎన్‌.మోహనరావు, నాయకులు బమ్మిడి ఆనందరావు, బి.రామకృష్ణ, తమ్మినాన భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
సోంపేట మండలంలోని మామిడిపల్లిలో సమరభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌.లక్ష్మీనారాయణ, వేమన్న, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.