గుంటూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 30 నుండి సెప్టెంబర్ 4వరకు తలపెట్టిన సమర భేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు పిలుపునిచ్చారు. శనివారం బ్రాడీపేటలోని సిపియం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యస్.యస్.చెంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యజీవితావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగిపోయాయని, పేదల జీవితాలు దుర్భరంగా మారాయని చెప్పారు. నరేంద్ర మోడి అధికారానికి రాక ముందు రూ.450లు ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200లకు పెరిగిందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్థానం చేసి, రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేట్ సంస్థలకు కట్టబెడు తున్నారని, ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ,
నిరుద్యోగాన్ని పెంచుతున్నారన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పేదలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం బాటలోనే పయనిస్తుందన్నారు. విద్యుత్ సంస్క రణల పేరుతో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం, ట్రూఅప్ ఛార్జీలు, సర్దు బాటు ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, సర్‌ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపుతున్నారన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీల అమలు, విశాఖ రైల్వేజోన్‌కు నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాడకుండా సమర్ధిస్తున్నా యన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకుని దీర్ఘకాలంగా నివాసముంటున్న పేదలకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని సమావేశం తీర్మా నించింది. తాడేపల్లి మండలంలోని ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ క్రింద సుమారు 1000 ఎకరాల భూములు సాగుఅవుతుందని, మురుగునీరు పంట కాల్వల్లో కలవడంతో పంటలు నాశనం అవుతున్నాయని, పంట కాల్వల్లో మురుగు కలవకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. రాజధాని రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలు వెంటనే చెల్లించాలని, అసైన్డ్ భూముల రైతులకు కూడా కౌలు చెల్లించాలని, జిల్లా వ్యాపితంగా రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్థంగా మారిందని, వర్షం వస్తే రోడ్లు జలమయం అవుతున్నాయని యుద్ధప్రాతిపదికన రోడ్లు వేయాలని, అసైన్డ్ భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు పేదలకు ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని సమావేశం కోరింది.ఈ సమావేశంలో సిపియం జిల్లా నాయకులు ఎమ్.రవి, ఎన్.భావన్నారాయణ, కె.నళినీకాంత్, బి.వెంకటేశ్వర్లు, డి.వెంకటరెడ్డి, ఎల్.అరుణ, బి.కొటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










