- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు
ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు మరింత ఉధతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వెలగా లక్ష్మణరావు భవన్‌లో ఎన్టీఆర్ జిల్లా సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థల అనుకూల బడ్జెట్ అని, ఆహార, ఇంధన సబ్సిడీ కోతలు పెట్టడం సామాన్య ప్రజలకు భారాలే అని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థల ప్రైవేటికరణ ఆపాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ పునరుద్దరణ పేరుతో రైతులకు ఉచిత విద్యుత్‌ను కాదని, మోటార్స్ కీ మీటర్స్ పెట్టడం సామాన్య రైతులకు ఉచిత విద్యుత్ దూరం చేయడమేనని దీనిని రైతులు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలో, కార్పొరేషన్‌లో నీటి మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలన్నారు. రైతులకు రాష్ట్రంలో ధ్యానం బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ఆంజనేయులు, ఎన్ సిహెచ్ శ్రీనివాస్, కోట కళ్యాణ్, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్, మండల నాయకులు ఎ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.










