Aug 28,2023 00:23

ప్రజాశక్తి-తాడేపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 30వ తేదీ నుండి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు జరిగే సమరభేరిని జయప్రదం చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పోస్టర్లను స్థానిక మేకా అమరారెడ్డి భవన్‌లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ సిలిండర్‌ గతంలో ఎన్నడూ లేని విదంగా బిజెపి అధికారంలోకి వచ్చాక ఆరు సార్లు పెరిగి రూ.1200కు చేరిందని, పెట్రల్‌, డీజిల్‌ ధరలు కూడా అదే దారిలో ఉన్నాయని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడబీకిందని, నల్లడబ్బు వెలికితీస్తానని చెప్పిన మోడీ ధనవంతులు తమ వద్ద ఉన్న నల్లడబ్బును వైట్‌గా మార్చుకునేందుకు అవకాశం కల్పించారని విమర్శించారు. ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య మధ్య తరగతి ప్రజానీకం నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న విధానాలను రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అత్యంత ఉత్సాహంగా అమలు చేస్తుందని అన్నారు. బిజెపి పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే తమ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం గమనించడంలేదన్నారు. లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి ప్రాథమిక చట్టాలను నిర్వీర్యం చేశారని, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ ఒకటో తేదీన సచివాలయాల అధికారులకు అర్జీలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి కరపత్రం పంచాలని, సెప్టెంబర్‌ 4వ తేదీ మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఎం రూరల్‌, పట్టణ కమిటీ జనరల్‌ బాడీ సమావేశాల్లోనూ రామారావు మాట్లాడారు. సమావేశాలకు పున్నయ్య, కె.కరుణాక రరావు అధ్యక్షత వహించారు. తాడేపల్లి పట్టణం, రూరల్‌ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదల ఇళ్లకు పట్టాలివ్వాలని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే విధానాలను ప్రభుత్వం ఉపసంహరిం చుకోవాలని తీర్మానించారు.
సుందరయ్యనగర్‌, కృష్ణవేణినగర్‌, నదీ పరివాహక ప్రాంతంలో రివిట్‌మెంట్‌ నిర్మించి పేదలకు రక్షణ కల్పించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, గ్యాస్‌, విద్యుత్‌ భారాలు ఉపసంహరించుకోవాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం సంతకాల సేకరణ, కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మూడు ప్రాంతాల్లో జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు, పట్టణ, రూరల్‌ కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, డి.వెంకటరెడ్డి, నాయకులు డి.శ్రీనివాస కుమారి, వి.దుర్గారావు, డివి భాస్కరరెడ్డి, వై.బర్నబస్‌, కె.మేరి, పి.గిరిజ, కె.బాబూ రావు, డి.విజయబాబు, ఎస్‌కె బాష, భూజంగరావు, ప్రభాకర్‌, వి.రామారావు, కె.ఉష, బి.కుమారిపాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపియం ఆధ్వర్యంలో ఈనెల 30 నుండి సెప్టెంబర్‌ 4 వరకూ జరిగే నిరసనల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ పిలుపునిచ్చారు. ఆదివారం బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో క్యాంపెయిన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, బియ్యం, పాలు, పాలపదార్థాలపై జిఎస్‌టి వేయటంతో అదనపు భారం పడుతుందన్నారు. విద్యుత్‌ బిల్లులు భారీగా పెంచారన్నారు. పదేళ్ల క్రితం వినియోగించిన విద్యుత్‌కు ఇప్పుడు బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు. స్మార్ట్‌ మీటర్లు పెట్టి పగటి పగలు, రాత్రి వాడుకున్న కరెంటుకు వేర్వేగా ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం రంగం సిద్ధం చేస్తుందన్నారు. కేంద్రం పెట్టిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం లొంగి ప్రజలకు విద్యుత్‌ భారాలను మోపుతోందని విమర్శించారు. మరోవైపు ఉపాధి లేక నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్‌ 1న వార్డు సచివాలయాల్లో వినతిపత్రాలు, 4న తాలూకా ఆఫీసుల వద్ద ధర్నా చేపడుతున్నామన్నారు. కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
నగరంలో సిపిఎం కరపత్ర ప్రచారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ సిపియం ఆధ్వర్యంలో ఈనెల 30 నుండి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకూ జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపియం నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల విజయవంతానికి పార్టీ నాయకులు ఆదివారం డొంకరోడ్డులోని నిరుపేదల కాలనీ, బొంగరాలబీడు ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డొంకరోడ్డు ఏరియా శాఖ కార్యదర్శి గండికోట శంకర్‌, పి.దీప్తి మనోజ, పి.గొర్లదీవెనరావు పాల్గొన్నారు.
మారుతీ నగర్‌లో ప్రచారం..
అదనపు విద్యుత్‌ ఛార్జీలను వ్యతిరేకిస్తూ సిపియం నాయకులు ఆదివారం నాయిబ్రాహ్మణ కాలనీలో, మారుతీ నగర్‌లో ప్రచార కార్యమ్రకం చేపట్టారు. ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు బి.సత్యనారాయణ, ఎస్‌.కె.ఖాసింవలి, రంగ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - దుగ్గిరాల : మండలంలోని తుమ్మపూడిలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు, నాయకులు వై.బ్రహ్మేశ్వరరావు మాట్లా డుతూ విద్యుత్‌ సంస్కరణల పేరుతో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిం చడం, సాధారణ వినియోగదార్లపై వివిధ రకాల చార్జీల పేరుతో బిల్లుల భారం వేయడం తగదన్నారు. వై.స్టాలిన్‌, ఎ.పాములు, వై.శివయ్య, వై.నాగేశ్వరావు, బంగారుబాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి మంగళగిరి : పట్టణంలోని సింహాద్రి శివారెడ్డి భవనంలో పోస్టర్‌ను ఆవిష్కరించగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడారు. 30న పట్టణంలోని ఒకటో వార్డులో గల సిపిఎం కార్యాలయం వద్ద నుండి సమరభేరి కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఒకటి, రెండు తేదీల్లో వార్డు సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. నాలుగో తేదీన కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద, తాసిల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది వివరించారు. కార్యక్రమంలో నాయకులు పి.బాలకృష్ణ, జె.శివభావన్నారాయణ, కె.వెంకటేశ్వరరావు, ఎం.చంద్ర, బి.స్వామి నాథ్‌, భార్గవ, నాగేష్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మేడికొండూరు : మండలంలోని పేరేచర్లలో పోస్టర్‌ను ఆవిష్కరించగా జిల్లా నాయకులు బి.శ్రీనివాసరావు మాట్లాడారు. బి.రామకృష్ణ, ఎస్‌ఎం బాషా, సుధాకర్‌రెడి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.