కడప ప్రతినిధి/బద్వేలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను తరిమికొట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, కమిటీ సభ్యులు కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళ, బుధవారాల్లో బద్వేల్, కడప పట్టణాల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని రాష్ట్రాభివృద్ధి కోసం నినాదంతో చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో వారు ప్రసంగించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గపూర్ మాట్లాడుతూ రాయ లసీమ, నెల్లూరు జిల్లాలకు కృష్ణాజలాలతోనే మనుగడ సాగు తోందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి సర్కారు అవకాశవాద రాజకీయాలతో దిగువ రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్నారు. కర్నాటక ఎన్నికల తరుణంలో ఎగువభద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రూ.ఆరు వేల కోట్లు కేటాయి ంచిందన్నారు. తెలంగాణ ఎన్నికల తరుణంలో కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ వేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని విమర్శిం చారు. ఇటువంటి చేష్టల కారణంగా బ్రహ్మంసాగర్, గండికోట, హంద్రీ నీవా వంటి ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉంద న్నారు. బద్వేల్ పట్టణ శివారులో నిరుపేదలు పెద్దసంఖ్యలో ఉన్నారని, అటువంటి నిరుపేదలకు టిడ్కోగృహాలను కేటాయించకుండా తాత్సారం చేయడం దుర్మార్గమన్నారు.
నిర్భందాలకు ఎదురొడ్డాలి : ప్రభాకర్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ నిర్భంధ విధానాలకు ఎదురొడ్డి నిలబడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే నిర్భందాల్ని ప్రయోగిస్తోందన్నారు. మన సంక్షేమం, మన పిల్లల భవిష్యత్ భాగుండాలనే నియంతృత్వ పోకడలను అధిగమించాలని తెలిపారు. ఇంటింటికీ వచ్చే రాజకీయ పార్టీలను తమ పిల్లల భవిష్యత్ కోసం ఎన్ని పరిశ్రమలు తెచ్చారో నిలదీయాలన్నారు. అంగన్వాడీ, ఉపాధ్యాయ, అసంఘటిత, సంఘటిత రంగాల ప్రజలను ఛైతన్యవంతం చేయడం ద్వారా ప్రజాపోరాటాలను విస్తృతం చేయాలన్నారు.
ప్రభుత్వ రంగంలో 'ఉక్కు' ఏర్పాటు చేయాలి : కృష్ణయ్య
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగులకు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. ఫలితంగా ఇక్కడి నుంచి ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు నిలిచిపోతా యని తెలిపారు. రాష్ట్రంలోని పాలకులు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా లభించే ప్రయోజనాల్ని గమనించడం లేదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రిక్రూట్‌మెంట్ అయిన మొదటి15 మంది ఇంజినీర్లలో తానూ ఒకడినని, ఉక్కు పరిశ్ర మను ఏర్పాటు చేస్తే జిల్లా ఆర్థిక, సామాజిక ముఖచిత్రంలో పెనుమార్పులు సంభవిస్తాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని పాలకులు విభజన హామీ లను నెర వేర్చాలని కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదన్నారు.
ప్రత్యామ్నాయ విధానాలను ఆదరించండి : ఉమామహేశ్వరరావు
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన విధానాలు ఒక్కటేనని, ఫలితంగా దేశ సంపదను కొద్ది మంది చేతుల్లో పోగుబడేలా చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వరరావు అన్నారు. ఫలితంగా పేదరికం, దారిద్య్రం తాండవం చేస్తున్నాయని తెలిపారు. 16 రకాల నిత్యావసరాల ప్యాకేజీని అందించే సిపిఎం మో డల్ కావాలా, సంక్షేమ పథకాల పేరుతో కొంత మందికి అరకొర సంక్షేమ చర్యలకు పరిమితమయ్యే మోడల్ కావాలో ఆలోచించుకోవాలన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో కదలికేదీ : భాస్కరయ్య
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఎటువంటి కదలిక లేదని, ఫలితంగా లక్షలాది ఎకరాల ఆయకట్టు ప్రశ్నా ర్థకంగా మారిందని సిపిఎం రాష్ట్ర నాయకులు భాస్కరయ్య తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటింటికీ తిరగాలని చెబుతున్నాడని, పాదయాత్రలో తీసుకున్న అర్జీలు ఏమ య్యాయని నిలదీయాలని విజ్జప్తి చేశారు. బాబు హయాంలోని విద్యుత్ ఉద్యమంలో ముగ్గురిని బలి తీసు కున్నారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడు షర తులతో యూజర్ ఛార్జీలను విధిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్‌పోన్ ఛార్జీల తరహాలో నగదు ఖర్చయిపోయిన వెంటనే కరెంటు సరఫరా నిలిచిపోయేలా స్మార్ట్‌మీటర్లు బిగిస్తున్నారని హెచ్చరించారు.
నూతన విద్యా విధానాన్ని నిలిపేయాలి : రమాదేవి
నూతన విద్యావిధానం పేరుతో పాఠశాలలను విలీనం చేస్తు న్నారని, ఫలితంగా స్త్రీలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే ఇటు వంటి విధానాలను తీసు కొచ్చారని సిపిఎం రాష్ట్ర నాయకులు రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి మూడు నిమిషాలకు అత్యాచారం, ప్రతి 15 నిమిషాలకు ఒక హత్యలు చోటుచేసుకుంటున్న దశలో ఆడపిల్లలు విద్యాభ్యాసం సాగించడం సాధ్య పడడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భేటీ బచావో..భేటీ పడావో నినాదాలకు ఎటువంటి ఉపయోగం ఉండబోదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు.కార్మికుల సంక్షేమబోర్డులోని నిధులను దారి మళ్లించి, భవన నిర్మాణ కార్మికులను గాలికి వదిలేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు శివకుమార్, మనోహర్, శ్రీనివాసులరెడ్డి, దస్తగిరిరెడ్డి, ఓబులేసు, శివకుమార్, చంద్రారెడ్డి, పాపిరెడ్డి ప్రజలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.