Aug 20,2023 23:30

ముప్పాళ్ల: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సిపిఎం నాయకులు నిరసించారు. మండలంలోని మాదలలోని సత్రం సెంటర్‌లో ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు గ్రామ నాయకులు మార్పుల వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలపై,ముఖ్యంగా దళితులు, ముస్లింల పైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. మణిపూర్‌లో మహిళలపై దాడులు, అత్యా చారాలు కొనసాగుతున్నప్పటికీ మన రాష్ట్రంలో నిఅధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులు నోరుమెదపడం లేదని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మతో న్మాదాన్ని బిజెపి రెచ్చగొడుతోందని విమర్శించారు. నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఎం అన్నారు. పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ రోజురోజుకి పెరుగుతున వస్తువుల ధరలు అదుపు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సెప్టెంబర్‌ 1వ తేదీ నుండి 10 వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగసభలో సిపిఎం మండల కార్యదర్శి గుంటుపల్లి బాలకృష్ణ,మండల కమిటీ సభ్యులు జాలయ్య, పటాన్‌ సైదా ఖాన్‌, సత్యనారాయణ రెడ్డి, నాగేశ్వరరావు, పార్టీ మహిళ నాయకులు గద్దె ఉమశ్రీ, గుంటుపల్లి రజనీ పాల్గొన్నారు.