
- సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, కార్పొరేటర్ సత్యబాబు
- పశ్చిమలో సిపిఎం 'ప్రజా రక్షణ భేరి' ప్రారంభం
- 15న చలో విజయవాడ విజయవంతం కోరుతూ సమావేశాలు
ప్రజాశక్తి-వన్‌టౌన్: పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్‌లో సిపిఎం 'ప్రజా రక్షణ భేరి' ప్రచార యాత్రను గురువారం 50వ డివిజన్ కార్పొరేటర్, సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు ప్రారంభించారు. ఆంజనేయ వాగు సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రచార యాత్రలో బిజెపి, వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలకు నిరసనగా కరపత్రాలు పంపిణీ చేస్తూ పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బోయి సత్యబాబు మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బిజెపి పాలనలో ఉన రాష్ట్రాలలో మైనార్టీలకు భద్రల లేకుండా పోతోందన్నారు. కోట్లాది మంది కార్మికుల Vక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్ వంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. తాను కూడా ఏమాత్రం తీసుపోనంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్పొరేట్‌లకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కృష్ణపట్నం, గంగవరం మేజర్ పోర్టులతో పాటు రాష్ట్ర ప్రజల సంపదను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలకు, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. వైసిపి ప్రభుత్వ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయని అన్నారు. మరో పక్క రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు మోపారని, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని తెలిపారు. నవంబర్ 15న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఇ.వి.నారాయణ, కె.సూరిబాబు, ఎస్.సుబ్బారెడ్డి, గాదె బాలిరెడ్డి, కె.సత్యనారాయణ, సూరా శ్రీను తదితరులు పాల్గొన్నారు. తిరువూరు: కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి, ప్రశ్నిస్తానని చెబుతున్న జనసేన పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ విమర్శించారు. నవంబర్ 15న విజయవాడలో జరగనన్న ప్రజారక్షణ భేరి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పట్టణ కమిటీ అధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజల వద్ద నుండి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కర్యదర్శి వర్గ సభ్యుల ఎం.నాగేంద్ర ప్రసాద్, జిల్లా సీనియర్ నాయకులు సానికొమ్ము నాగేశ్వరరెడ్డి, సీనియర్ నాయకులు గుళ్లపల్లి వెంకటరత్నం, ఎస్వీ భద్రం పాల్గొన్నారు. నందిగామ: నందిగామ సుందరయ్య భవనంలో చలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివి కృష్ణ మాట్లాడుతూ లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్ 15న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలను కలవరపరుస్తు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నందిగామ పట్టణ కార్యదర్శి కట్టారపు గోపాల్, పట్టణ కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసిం, గోపీనాయక్, కర్రీ వెంకటేశ్వరరావు, రవి శేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.