రైతు ఉద్యమం వంటి ప్రజా ఉద్యమాలు ప్రజల చైతన్యాన్ని ఒకానొక ఉన్నత స్థాయికి తీసుకుపోగలగడం ఎందువలన సాధ్యమౌతుందంటే...ఆ ఉద్యమం ప్రజలందరినీ ఒక ఉమ్మడి లౌకిక లక్ష్యం చుట్టూ ఐక్యం చేస్తుంది. బిజెపి తరహా ఉద్యమాలు అందుకు భిన్నంగా, సమాజంలో ఉన్న వెనుకబాటుతనాన్ని, లోపాలను, తప్పుడు సాంప్రదాయాలను వాడుకుని, వాటిని మరింత రెచ్చగొట్టేలా ఆజ్యం పోస్తాయి. ఉన్న విభేదాలను మరింత హెచ్చు చేస్తాయి. ప్రజల చైతన్యాన్నిమరింత అధమ స్థాయికి తీసుకుపోతాయి.
ప్రజా పోరాటం అంటే ప్రజలు తమ జీవితాల స్థితిగతులను, భౌతిక పరిస్థితులను మెరుగుపరుచుకోడానికి అందరూ కలిసి ఐక్యంగా చేసే పోరాటం. ప్రజానీకంలో ఒక భాగం వేరొక భాగం మీద చేసే పోరాటం ప్రజా పోరాటం అనిపించుకోదు. నిజమైన ప్రజా పోరాటం అనేది మనకు ప్రజాస్వామ్య విలువలను, ఐక్యతను నేర్పే అత్యుత్తమ గురువు. ఈ ప్రజా పోరాటాలలోకెల్లా రాజకీయ విప్లవ పోరాటాలు అత్యున్నత స్థాయికి చెందినవి. అందుకే అటువంటి రాజకీయ విప్లవ పోరాటాలలో తీవ్ర స్థాయిలో సామాజిక మథనం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రజలలో ఒకరి పట్ల మరొకరికి అంతవరకూ ఉండే భావాలు విప్లవాత్మకంగా మార్పులు చెందుతాయి. ఏదైనా ఒక విప్లవం విజయం సాధించాలంటే ప్రజల అవగాహనలో మార్పులు రావడం అవశ్యంగా జరగాలి. ఆ విప్లవ పోరాటంలో పాల్గొనే క్రమంలోనే ప్రజలలో ఆ విధమైన మార్పులు సాధ్యపడతాయి.
ప్రజా ఉద్యమాలు నేర్పే పోరాటాల ప్రాధాన్యతను చాలామంది గుర్తించడంలేదు. మన దేశంలో జరిగిన జాతీయోద్యమం మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ. ఆనాడు సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న కారణంగానే ప్రజలు కులపరమైన దురభిమానాలను, పురుషాధిక్య ధోరణులను, ఇతర ఆధిపత్య సాంప్రదాయాలను అధిగమించగలిగే స్థితికి ఒక్కసారి చేరుకున్నారు. కొంతమేరకు సోషలిస్టు, కమ్యూనిస్టు ధోరణులను కూడా అలవరచుకున్నారు. జాతీయోద్యమం ప్రభావం మొత్తం దేశం అంతటా ఒకే తీరుగా పడలేదు. అది కొంత పరిమితమే. అయినప్పటికీ, భారతదేశం ఒక ఆధునిక దేశంగా అభివృద్ధి చెందేందుకు ప్రాతిపదికగా ఒక రాజ్యాంగం రూపొందింది. ఆ రాజ్యాంగం దేశంలో పౌరులందరూ సమానమేనని హామీ ఇచ్చింది. ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించింది. మతాతీతంగా రాజ్యం ఉండాలన్న లౌకిక విధానాన్ని నిర్దేశించింది. వివిధ ప్రజాతంత్ర వ్యవస్థలకు రూపకల్పన చేసింది. ఇదంతా ఆ జాతీయోద్యమంలో అప్పటి ప్రజానీకం పెద్దఎత్తున పాల్గొనకపోయి వుంటే సాధ్యమయ్యేది కాదు.
వేల సంవత్సరాలపాటు అసమానతలు కుల వ్యవస్థ రూపంలో వ్యవస్థీకృతం అయిపోయి కొనసాగుతూ వుండిన దేశం మనది. అటువంటి దేశంలో పైన తెలిపిన విధంగా మార్పు సాధ్యపడిందంటే అది మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీయో, జవహర్‌లాల్ నెహ్రూనో, బి.ఆర్. అంబేద్కరో పెట్టిన భిక్ష కాదు. వలస పాలనకు, దోపిడీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్న పోరాటం ఫలితం. నవభారత నిర్మాణం ఆ ఉద్యమం ప్రజల ముందు ఉంచిన లక్ష్యం. రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత అప్పగించబడిన నాయకులు వ్యక్తులుగా పోషించిన పాత్ర కూడా ఉంది. వారు ఉద్యమంలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలను రాజ్యాంగంలో వ్యక్తీకరించారు.
ప్రజల దృక్పథాలను మార్చడంలో ప్రజా ఉద్యమాల పాత్ర గురించి ప్రముఖ తత్వవేత్త అకీల్ బిల్‌గ్రామీ వివరిస్తూ కొన్ని నిర్దిష్టమైన, కొట్టవచ్చినట్టు కనిపించే ఉదాహరణలను ఇచ్చారు. మహిళలకు ఓటు హక్కును కల్పించే బిల్లు 1921లో బెంగాల్ ప్రావిన్షియల్ శాసనమండలిలో ఓడిపోయింది. ఆ తర్వాత ఖిలాఫత్ ఉద్యమం ఊపందుకుంది. అందులో పాల్గొన్న చాలామంది ముస్లిముల దృక్పథాలలో మార్పు వచ్చింది. అందులో చాలామంది సి.ఆర్. దాస్ స్థాపించిన స్వరాజ్య పార్టీలో చేరారు. అది కాంగ్రెస్ లోనే అంతర్భాగంగా ఉంటూ పని చేసేది. మార్పు రావాలంటే ప్రగతిశీల చట్టాలను తీసుకురావాలని సి.ఆర్. దాస్ ప్రబోధించారు. 1925లో బెంగాల్ ప్రావిన్షియల్ శాసనమండలిలో మహిళలకు ఓటుహక్కు కల్పించే బిల్లును తిరిగి ప్రవేశ పెట్టినప్పుడు స్వరాజ్ పార్టీకి చెందిన పలువురు ముస్లింలు ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు చేయడంతో ఆ బిల్లు ఆమోదం పొందింది. ఒక ఛాందసవాద సమాజంలో లింగపరమైన వివక్షతను సమర్ధించే దృక్పథం నుండి స్వల్ప కాలంలోనే బైటపడడమనేది వారంతా ఒక పెద్ద ప్రజా ఉద్యమంలో పాల్గొనడం వల్లనే సాధ్యమైంది. ఆ ఖిలాఫత్ ఉద్యమం సామ్రాజ్యవాద వ్యతిరేకమే అయినా, అత్యంత ఛాందసవాద లక్ష్యంతో-మళ్ళీ ఖలీఫా (ముస్లిం మతగురువు, చక్రవర్తి) పాలన రావాలన్న లక్ష్యంతో-మొదలైనా, చాలామంది దృక్పథాలలో ముఖ్యమైన మార్పులకు కారణమైంది. మన దేశంలో తొలినాటి కమ్యూనిస్టులలో చాలామంది ఈ ఉద్యమ శ్రేణుల నుండే వచ్చారు.
ఈ రోజు రైతు ఉద్యమం కూడా అటువంటి ప్రభావాన్నే కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్యమంలో పాల్గొంటున్నవారిలో 2013 ముజఫర్‌నగర్ మత కల్లోలాల సందర్భంగా చెలరేగిన మతోన్మాద విద్వేష ప్రచారంతోపాటు కొట్టుకుపోయినవారు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అప్పుడు జాట్ హిందువులకు, ముస్లింలకు మధ్య పెరిగిన పొరపొచ్చాలను బిజెపి ఎన్నికలలో బాగా ఉపయోగించుకుంది. అంతవరకూ ఆ ప్రాంతంలో ఎన్నికలలో బిజెపికి ఎప్పుడూ ఆధిక్యత లభించలేదు. కాని ఆ మత ఘర్షణల అనంతరం బిజెపి ఆ పశ్చిమ యు.పి ప్రాంతంలో కాలూనుకోవడమేగాక ఆ ప్రాంతం నుండే బిజెపికి యు.పి పార్లమెంటు స్థానాలు అత్యధికంగా దక్కాయి. ఆ మెజారిటీ ఆధారంగానే బిజెపికి పార్లమెంటులో మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గాని, 2019 పార్లమెంటు ఎన్నికలలోగాని అక్కడి ప్రజల మధ్య మతపరంగా ఉన్న చీలిక బిజెపికి బాగా తోడ్పడింది.
ప్రజల మధ్య ఏర్పడిన ఈ చీలికను రైతు ఉద్యమం అధిగమించింది. మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా హిందూ జాట్లను, ముస్లింలను ఒకటి చేసి నిలబెట్టింది. ఆ ప్రాంతంలో ఎవరూ బిజెపి బడా నేతలతో సామాజిక కార్యకలాపాలలో కలిసిమెలిసి తిరగకూడదని రైతు నాయకులు పిలుపునిచ్చారు. ఆ పిలుపును ఎలాగైనా భగం చేయాలని ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఒక బిజెపి నేత ప్రయత్నించాడు. ఆ పెద్దమనిషి 2013 మత కల్లోలాలను రెచ్చగొట్టడంలో కీలక భూమిక పోషించాడు. అదే వ్యక్తి ఇప్పుడు ఒక ఊరిలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు పోతే ఆ గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు. ఈ మంత్రి తన వెంట తెచ్చుకున్న గూండాలు ఆ గ్రామస్తులపై దాడి చేశారు. ప్రత్యర్ధి రాజకీయ పార్టీకి చెందినవారే తనను అడ్డుకున్నారని ఆ మంత్రి ప్రకటించాడు కూడా. కాని ఆ గ్రామస్తులంతా ఐక్యంగా పోలీసు స్టేషన్‌కి వెళ్ళి ఆ మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో మంత్రి అసలు రంగు బట్టబయలైంది. అంతకు ముందు రెండుగా చీలిపోయిన ఆ గ్రామ ప్రజలలో ఇప్పుడు బిజెపి జొప్పించిన కట్టుకథలు ఏమాత్రమూ పని చేయడంలేదు. వారి దృక్పథాలలో చాలా పెద్ద మార్పు కనపడుతోంది.
ఈ ప్రాంతంలో జాట్ రైతులకు, దళిత కూలీలకు మధ్య ఘర్షణలు ఎప్పుడూ జరుగుతూ వుండేవి. అది రైతులకు, కూలీలకు మధ్య ఐక్యత సాధించడానికి పెద్ద అవరోధంగా ఉండేది. యజమానికి, కూలీకి నడుమ ఉండే ఘర్షణకి తోడు ఇక్కడ వారి కులాల మధ్య ఉండే ఘర్షణ తోడైంది. ఈ ఘర్షణలతో ఎప్పుడూ అట్టుడుకుతూ వుండే ఆ ప్రాంతంలో (ఇది డిల్లీకి సమీపంలోనే ఉంటుంది) కంజావాలా అనే గ్రామంలో జరిగిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా వార్తలలోకి ఎక్కింది. అయితే ప్రస్తుతం రైతు ఉద్యమం ఆ రెండు గ్రూపులను ఒకదగ్గరకు చేర్చింది. వారి నడుమ ఎన్నడూ లేనంత ఐక్యత నెలకొంది. ఆ మూడు వ్యవసాయ చట్టాలు గనుక అమలు లోకి వస్తే అవి భారతీయ వ్యవసాయానికి మృత్యు ఘంటికలు మోగించినట్టేనని, వ్యవసాయ రంగంలోని అన్ని తరగతులకూ అది హానికరమేనని వారందరికీ అర్ధమైంది. అందుకే ఆ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అన్ని గ్రూపుల ప్రజలూ ఏకమయ్యారు.
పాత సాంప్రదాయ ఆచారాల దృక్పథాలను అధిగమించిన మూడో దృష్టాంతం లింగ వివక్షతకు సంబంధించినది. పురుషాధిక్యత చాలా ఎక్కువ మోతాదులో ఉన్న మన సమాజంలో రైతు ఉద్యమంలో మహిళలు అసాధారణమైన రీతిలో చురుగ్గా పాల్గొనడం ఎంతో ప్రాధాన్యత కలిగిన సందర్భం అని చెప్పాలి. బహుశా ఇది ఎవరూ ముందు ఊహించి వుండరు. మహిళలలో పెల్లుబికిన ఈ చైతన్యం వారిని ప్రజా పోరాటాల లోకి ముందుకు తెచ్చింది. భవిష్యత్తులో స్త్రీ-పురుష సంబంధాలలో దీని ప్రభావం తప్పనిసరిగా ఉండబోతున్నది.
ఇక ఆ ప్రాంతంలోని పారిశ్రామిక కార్మికులకు, రైతులకు నడుమ నెలకొన్న సంఘీభావం ముందెన్నడూ లేనంత ఉన్నత స్థాయికి చేరింది. ఉద్యమంలో ముందుకు తెస్తున్న చిహ్నాలు, గుర్తు చేసుకుంటున్న చారిత్రిక ఘటనలు అన్నీ గత పోరాటాల సాంప్రదాయాలను మళ్ళీ ముందుకు తెస్తున్నాయి. 1906లో భగత్‌సింగ్ బాబాయి అజిత్‌సింగ్ పాల్గొన్న 'పగ్‌డీ సమ్హాల్' ఉద్యమ నినాదాన్ని మళ్ళీ ముందుకు తెచ్చారు. వలస పాలకుల కాలంలో భారతీయ వ్యవసాయానికి ఎటువంటి ముప్పు వాటిల్లిందో మళ్ళీ అటువంటి ముప్పే ఇప్పుడూ దాపురించిందన్న విషయాన్ని ఈ నినాదం నొక్కిచెప్తోంది.
రైతు ఉద్యమం ఐక్యతను, ప్రజాతంత్ర స్వభావాన్ని సంతరించుకుందన్నది ఎంతో ప్రాధాన్యతగలిగిన తిరుగులేని వాస్తవం (అంతకుముందు పంజాబ్ యువత, సమాజానికి దూరమైపోయి, మాదకద్రవ్యాలకు బానిసలైపోతున్నారన్న సమస్య ఉండేది. ఈ ఉద్యమం తర్వాత దాని ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు). రాజకీయాల లోకి బిజెపి ప్రభుత్వం జొప్పించిన విద్వేషాలకు, నియంతృత్వ ధోరణులకు పూర్తి విరుద్ధమైన ధోరణులతో రైతు ఉద్యమం నడుస్తోంది.
ఇక్కడే మనకు మనుగడ కోసం ప్రజలు సాగించే ప్రజా ఉద్యమాల లౌకిక స్వభావానికి, బిజెపి నడిపే విద్వేషపూరిత ఉద్యమాల స్వభావానికి మధ్య తేడా కొట్టవచ్చినట్లు కనపడుతుంది. ఎల్.కె అద్వానీ ఆనాడు తన రథయాత్రను ప్రారంభించినపుడు కొంతమంది వ్యాఖ్యాతలు ఒక బ్రహ్మాండమైన ''ప్రజా ఉద్యమాన్ని'' రగిల్చాడని అన్నారు. ప్రజల దృక్పథాలను మార్చే నిజమైన ప్రజా ఉద్యమాలకు, బిజెపి-తరహా ఉద్యమాలకు గల తేడాను వారు గమనించడంలో విఫలమయ్యారు.
రైతు ఉద్యమం వంటి ప్రజా ఉద్యమాలు ప్రజల చైతన్యాన్ని ఒకానొక ఉన్నత స్థాయికి తీసుకుపోగలగడం ఎందువలన సాధ్యమౌతుందంటే...ఆ ఉద్యమం ప్రజలందరినీ ఒక ఉమ్మడి లౌకిక లక్ష్యం చుట్టూ ఐక్యం చేస్తుంది. బిజెపి తరహా ఉద్యమాలు అందుకు భిన్నంగా, సమాజంలో ఉన్న వెనుకబాటుతనాన్ని, లోపాలను, తప్పుడు సాంప్రదాయాలను వాడుకుని, వాటిని మరింత రెచ్చగొట్టేలా ఆజ్యం పోస్తాయి. ఉన్న విభేదాలను మరింత హెచ్చు చేస్తాయి. ప్రజల చైతన్యాన్ని మరింత అధమ స్థాయికి తీసుకుపోతాయి.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమానికి ఆర్‌ఎస్‌ఎస్ దూరంగా ఉండిపోవడం అనుకోకుండా జరిగినదేమీ కాదు. ఆ జాతీయోద్యమం దేశంలో ఒక కొత్త చైతన్యాన్ని రగుల్కొలిపిన ఉద్యమం. అందుకే సమాజాన్ని వెనక్కు నెట్టే సిద్ధాంతంతో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ అందులో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు సాగుతున్న రైతు ఉద్యమం ఆనాటి జాతీయోద్యమం రగిల్చిన చైతన్యానికి వారసురాలిగా ఆవిర్భవించింది. ఆ చైతన్యాన్ని మరింత ముందుకు కొనిపోతున్నది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్











