దేశరక్షణ భేరి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర
ప్రజాశక్తి- అరకులోయ: ప్రజా ఉద్యమాలతోనే కేంద్రంలో మోడీ నేతృత్వంలో మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర హెచ్చరించారు. బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో అరకులోయలో దేశరక్షణ భేరి బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, దేశంలోని అనేక పార్టీలు మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒకే తాటిపైకొచ్చి పోరాడుతుంటే, రాష్ట్రంలోని అధికార వైసిపి, ఇతర విపక్షాలు మోడీకి అనుకూలంగా పనిచేయడం దారుణమన్నారు. నూతన అటవీ విధానం తీసుకొచ్చి ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టే కుయత్నాలను ప్రభుత్వాలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో శతశాతం ఉద్యోగాలను స్థానిక గిరిజనులకే అవకాశం కల్పించే జిఒ3ను పునరుద్ధరించి, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఎపికి ప్రత్యేకహోదాతోపాటు, ఇతర విభజన హామీలను అమలు చేయాలని, ఏజెన్సీలోని కాఫీ రైతులకు బకాయి పడ్డ రూ.40కోట్లను తక్షణమే చెల్లించాలని కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, అర్హులైన గిరిజనులందరికీ పోడు భూములకు సాగుహక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతోపాటు ప్రత్యేక డిఎస్‌సి అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ, ప్రజాధనాన్ని, ఆస్తులను ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టి ప్రజలపై భారాలు మోపడం దారుణమన్నారు. దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య చిచ్చుపెట్టి బిజెపి ప్రభుత్వం పబ్బం గడుకుంటోందని దుయ్యబట్టారు. గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో బిజెపికి సరిపడా సీట్లు రానప్పటికీ, దొడ్డిదారిన అధికారాన్ని దక్కించుకున్న బిజెపి, అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. బిజెపి చేస్తున్న పోరు యాత్ర ఎవరి కోసమని ప్రశ్నించారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం తామేమీ తీసిపోమన్నట్లు బిజెపి విధానాలే అవలంబిస్తూ ప్రజాకంటక పాలన సాగిస్తోందన్నారు.సిపిఎస్ రద్దు హామీని అటకెక్కించి, పంచాయతీలకు రావాల్సిన ఆర్థికసంఘం నిధులను దారిమళ్లించి మోసం చేసిందన్నారు. బిజెపి రూట్‌మ్యాప్‌లోనే పనిచేస్తూ, ప్రత్యేకహోదా, ఇతర అంశాలపై కేంద్రాన్ని జనసేనాని ప్రశ్నించడం లేదన్నారు. అచ్చేదిన్ అంటూ ధరలను ఆకాశానికెక్కించే ప్రజలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుదేలు పరిచాయన్నారు. స్టీల్‌ప్లాంట్, ఎల్‌ఐసి, రైల్వే, బ్యాంకులు వంటి ప్రభుత్వరంగ సంస్థలకు ప్రయివేటుకు ధారదత్తం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్రంలోబిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే, దేశం అథోగతి పాలవ్వడం ఖాయమన్నారు. దేశరక్షణ కోసం సిపిఎంను ఆదరించాలని పిలుపునిచ్చారు.
సిపిఎం డుంబ్రిగుడ మండల కార్యదర్శి పోతురాజు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు, సుంకరమెట్ట సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు, టోకూరు సర్పంచ్ మొస్య, మండల కార్యదర్శి రామారావు, పొద్దు బాలదేవ్, గసభా మాజీ సర్పంచ్ సురేష్, ఎస్. నాగులు, మహిళా నాయకురాలు శశికళ పాల్గొన్నారు










