ప్రజాశక్తి-కాకినాడ ప్రజా ఉద్యమాలపట్ల పోలీసుల వైఖరి మార్చుకోవాలని, రాజ్యాంగం ప్రకారం పని చేయాలని, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కుని కాపాడాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీచర్స్ హోమ్‌లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి అధ్యక్షతన శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరి వెంకటేశ్వరరావు, ఐఎన్‌టియుసి ఎపి అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఎఐసిసిటియు రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు గుబ్బల ఆదినారాయణ, ఎఐఎఫ్‌టియు జిల్లా నాయకులు అంజిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, పౌర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు రవాణా శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చే సందర్భంలో అంగన్వాడి కార్యకర్తల విజయవాడ ధర్నా, విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ వామపక్షాలు శాంతియుత ఆందోళన చేస్తున్న సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఉద్యమకారుల పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. తక్షణం రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై పురుష పోలీసులు అసభ్యకరమైన రీతిలో భౌతిక దాడులకు దిగుతున్న ఘటనల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే కాకినాడ ప్రాంతంలో నిత్యకత్యంగా ప్రజా ఉద్యమాలపై పోలీసుల పైశాచికత్వం పెరిగిందన్నారు. వీరికి స్థానిక అధికార పార్టీ నుండి సంపూర్ణ అండదండలు అందుతున్నాయి కాబట్టే ఏళ్ల తరబడి బదిలీలు కాకుండా ఒకే ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా పని చేయగలుగుతున్నారని విమర్శించారు. దళితులపై దాడులు, కార్మిక ఉద్యమాలు, రైతాంగ పోరాటాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు జరుగుతున్న సందర్భంలో జగన్ ప్రభుత్వంతోపాటు, పోలీసులు కూడా దోపిడీదారుల పక్షాన వహిస్తు ఉద్యమాల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే, కాకినాడ జిల్లాలో మాత్రం ఉద్యమాలను నీరు కార్చేందుకు కలెక్టరేట్ వద్ద చట్టవ్యతిరేక నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ పద్ధతులే పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నాయని, ఈ విధానాలకు త్వరలో స్వస్తి పలకడానికి కార్మికులు, రైతులు, దళితులు, ప్రజలు ఐక్య పోరాటాలకు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమస్య తీవ్రతపట్ల జిల్లా ఎస్‌పి తీసుకునే చర్యలను బట్టి భవిష్యత్ కార్యాచరణ అమలుకు సిద్ధపడాతామని ఐక్యప్రకటన విడుదల చేశారు. మానవ హక్కుల సంఘానికి, న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఎపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రమణమ్మ నగర కార్యదర్శి కె.జ్యోతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల ఈశ్వరి ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగుల ఈశ్వరరావు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడకొండ, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, దళిత హక్కుల పోరాటసమితి జిల్లా నాయకులు శాఖా రామకష్ణ. సురేష్, కాశీ విశ్వనాధ్, వేణి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










