May 19,2023 00:22

నగర పోలీస్‌ కమిషనర్‌ కు వినతి పత్రం సమర్పిస్తున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ తదితరులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ప్రజా ఉద్యమాలపై పోలీసు నిర్బంధం ఆపాలని, ప్రజాతంత్ర ఉద్యమాలపై కొంత మంది పోలీసు అధికారులు అక్రమ కేసులు, బైండ్‌ఓవర్‌ కేసులు బనాయిస్తున్నారని, ఇది భావ్యం కాదని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఉపాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, కోశాధికారి ఎస్‌.జ్యోతీశ్వరరావు తదితర ప్రతినిధి వర్గం గురువారం నగర పోలీసు కమిషనర్‌కు వినతి పత్రం అందించారు. సిఐటియు ప్రజాతంత్రంగా కార్మికులు, ప్రజల హక్కుల కోసం పోరాడే నిజాయతీ, చిత్తశుద్ధి కల్గిన యూనియన్‌ అని, ఎటువంటి చట్ట వ్యతిరేకమైన, అవినీతికరమైన, ద్రోహపూరితమైన చర్యలకు పాల్పడదని వినతి పత్రంలో పేర్కొన్నారు. అటువంటి కార్మిక నాయకులపైనా, కార్యకర్తలపైనా కొంత మంది పోలీసు అధికారులు అక్రమ కేసులు బనాయించి, తహశీల్దార్‌ వద్దకు తీసుకువెళ్ళి రూ.లక్షకు బైండ్‌ఓవర్‌ కేసులు బనాయిస్తున్నారని, ఇది అన్యాయమని, రాజ్యాంగం, సహజ న్యాయసూత్రాలకు భిన్నమైనదని పేర్కొన్నారు. ఈ విషయంపై నగర పోలీస్‌ కమిషనర్‌ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం ఈనెల 3న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తే, విశాఖలో 24 మంది కార్యకర్తలపై రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేసులు బనాయించారని తెలిపారు. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు సమస్యలు చెప్పుకునేందుకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వెళ్తే నలుగురు నాయకులు, కార్యకర్తలపైన కేసులు పెట్టారన్నారు.
క్లాప్‌ డ్రైవర్లకు జిఒ 7 ప్రకారం రూ.18,500 జీతం అమలుచేయాలని కోరుతూ ఈ నెల 12న యూనియన్‌ నాయకులు లేబర్‌ ఆఫీస్‌కి వెళ్లారని, పోలీసులే దగ్గరుండి జెసిఎల్‌ దగ్గరకు తీసుకెళ్లారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. అయినా నాలుగు రోజుల తరువాత అంటే 16వ తేదీన పోలీసులు సుమారు 30 మందిపై అన్యాయంగా కేసులు బనాయించారని తెలిపారు. మరుసటి రోజు జివిఎంసి వద్ద తాము ధర్నా చేస్తుంటే ఇద్దరికి నోటీసులు ఇచ్చారన్నారు. సుమారు 49 మందిపైన కేసులు బనాయించారని, బైండ్‌ఓవర్‌ కేసులు పెట్టారని వివరించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి కేసులు బనాయించలేదన్నారు.
ముఖ్యమంత్రి వైజాగ్‌ వచ్చినప్పుడు సిఐటియు ఎటువంటి పిలుపులు ఇవ్వనప్పటికీ ముందుస్తు అరెస్టులు, గృహ నిర్బంధం చేస్తున్నారని, నాయకుల ఇళ్లకు కానిస్టేబుళ్లు రాత్రులు వెళ్లి ఇళ్ళలో కూర్చుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై నగర పోలీస్‌ కమిషనర్‌ తగు విచారణ జరపాలని కోరారు. వాస్తవ పరిస్థితిని ఆలోచించి సిఐటియు నాయకులు, కార్యకర్తలపై మోపిన కేసులను ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు.