Aug 06,2023 22:58

మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం

* గద్దర్‌ మృతికి సిఐటియు సంతాపం
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
ప్రజా గాయకుడు గద్దర్‌ మృతి అభ్యుదయ సాహిత్య లోకానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.నర్సింగరావు, కె.సుబ్బరావమ్మ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు అన్నారు. నగరంలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సిఐటియు జిల్లా వర్క్‌షాపులో గద్దర్‌ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్దర్‌ తన కళలతో ప్రజలను చైతన్యపరిచారని కొనియాడారు. దశాబ్దాల పాటు యువతను ఉర్రూతలూగించారని, జానపద కళారూపాలకు విప్లవ సాహిత్యాన్ని జోడించి ప్రజా సంస్కృతికి పట్టం కట్టారన్నారు. సామాజిక మార్పు కోసం తపన పడ్డారని, ఇందుకోసం నిర్బంధాన్ని అనుభవించారని చెప్పారు.
ప్రజల హృదయాల్లో యుద్ధనౌక
గద్దర్‌ ప్రజల హృదయాల్లో యుద్ధ నౌకగా నిలిచారని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజ మార్పు కోసం తన ఆటపాటతో పనిచేశారని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గద్దర్‌ ప్రవహించే పాటల తూటా : స్పీకర్‌
ప్రజాశక్తి - ఆమదాలవలస
గద్దర్‌ పాటంటే గాలికి కొట్టుకొచ్చిన గాలివాటం కాదని, కాలిగోటి నుంచి నడినెత్తి దాకా ప్రవహించే పాటల తూటా అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రజా యుద్ధనౌక ఇక లేరన్న విషయం తెలిసి తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటి ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరిపేందుకు మంత్రిగా తాను, నక్సలైట్ల తరఫున గద్దర్‌ హాజరయ్యామని గుర్తు చేసుకున్నారు. నాటి నుంచి ఆయనపై తనకెంతో గౌరవం, అనుబంధం ఉండేదని పేర్కొన్నారు. పేదల గుండెచప్పుడుగా ఆయన నోట పాడిన ప్రతి పాట ప్రజల పాట అని కొనియాడారు. ప్రజాదరణ ఉన్న గొంతుక ఆయన సొంతమని, ఆ గొంతు మూగబోయిందంటే నమ్మశక్యం కావడం లేదని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధాకరం
నరసననపేట : గద్దర్‌ మృతికి ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. తన జీవితమంతా ప్రజా పోరాటాలకే అంకితం చేసిన గొప్ప ధీశాలి గద్దర్‌ అని కొనియాడారు. ఆయన పాటలను వింటూ సాయంత్రాలను గడిపే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. 1980, 90ల్లో జిల్లాలో గద్దర్‌ పాటలు ఎంతో ప్రజాదరణను పొందాయని తెలిపారు. గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తులను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
టెక్కలి, రూరల్‌ : గద్దర్‌ మృతి సాహిత్య లోకానికి తీరనిలోటు అని పేడాడ భీమారావు విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్‌ పేడాడ పరమేశ్వరరావు పేర్కొన్నారు. డిటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కోత ధర్మారావు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకులు మిస్క కృష్ణయ్య, బెలమర ప్రభాకరరావు, బిఎస్‌పి నాయకులు బోకర నారాయణరావు, జన చైతన్య మండలి జిల్లా సభ్యులు సుంకు గోపీనాథ్‌, దుప్పాడ జగన్నాథరావు, కె.దమయంతి సంతాపాన్ని తెలిపారు.
పొందూరు : కోట్లాది మంది ప్రజలను తన గళంతో ఉత్తేజపరచిన అభ్యుదయ, విప్లవ గాయకుడు గద్దర్‌ చిరస్మరణీయుడని, ఆయన మృతి జానపద విప్లవ కళా, సాహిత్యాలకు తీరని లోటు అని జాతీయ సవర భాష సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ అల్లంశెట్టి చంద్రశేఖరరావు, రచయిత వాండ్రంగి కొండలరావు పేర్కొన్నారు. జాతీయ కళాకారునికి స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.