Feb 08,2023 23:27

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:ప్రజా ఉద్యమాలను అణచి వేయడానికే రాష్ట్ర ప్రభుత్వం జీఓ 1ని తీసుకొచ్చిందని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స విమర్శించారు. సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో జీఓ 1ను వ్యతిరేకిస్తూ బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ, బ్రిటిష్‌ కాలం నాటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడానికి జీఓ 1ని తీసుకొచ్చారని తెలిపారు. సిఎం జగన్‌ నిరంకుశంగా వ్యవహస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతీపక్షం నాయకులను, ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా ఎక్కడికక్కడే హౌస్‌ అరెస్ట్లు చేస్తుందన్నారు. రోడ్డుపై అరెస్టులు చేసి, నిర్బందిస్తుందని పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వం బ్రిటిష్‌ ప్రభుత్వం చేసిన చట్టాల్ని తీసుకొచ్చి ప్రజలపై ఉక్కు పాదం మోపాలని చూస్తున్నారని విమర్శించారు. వైసిపి పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సభలు, సమావేశాలు జరపకూడదనే నిబంధనలు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జీఓ 1ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రద్దు చేయని పక్షంలో భవిష్యత్తులో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కలిసి కట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ అరకు మండల అధ్యక్షులు శెట్టి బాబురావు మాట్లాడుతూ, సిఎం జగన్‌ ప్రతిపక్షాలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదని అన్నారు.
జనసేన అరకు పార్లమెంట్‌ కన్వీనర్‌ మాదల శ్రీరామ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైయస్సార్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ అనుమతి రద్దు చేయాలన్నారు. ఇటువంటి చీకటి జీఓను తీసుకొచ్చి ప్రజా ఉద్యమాన్ని అణచి వేస్తుందని, ఉపాధ్యాయులను కూడా వదలకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, అరకు వేలి మాజీ వైస్‌ ఎంపీపీ వద్దు అమ్మన్న, హ్యూమన్‌ రైట్స్‌ ఫారం కన్వీనర్‌ చిరంజీవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాసు, టిడిపి నాయకులు కృష్ణ, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు పి.స్వామి, సిఐటియు నాయకులు మగ్గన్న, తదితరులు పాల్గొన్నారు.