Mar 03,2023 23:46

నిరసన వ్యక్తం చేస్తున్న డివైఎఫ్‌ఐ నేతలు

'గో బ్యాక్‌ అదానీ' పేరిట డివైఎఫ్‌ఐ నిరసన
ప్రజాశక్తి-కలెక్టరేట్‌/ కంచరపాలెం :
ప్రజల సంపద లూటీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం నిలుపుదల చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యుఎస్‌ఎన్‌ రాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తాటిచెట్లపాలెం జంక్షన్‌ వద్ద 'గో బ్యాక్‌ అదానీ' పేరిట డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రభుత్వం గ్లోబల్‌ సమ్మిట్‌ కు అదానీని ఆహ్వానించడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అదానీకి దేశ సంపదను దోచిపెడుతుందని విమర్శించారు. పోర్టులు , ప్రభుత్వ కంపెనీలు, గనులు, వనరులు అన్నింటిని ఆదానీకి అప్పజెప్పడం అంటే దేశ ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను ప్రపంచమంతా గమనిస్తోందని, ఇప్పటికైనా వీటికి చరమగీతం పాడి దేశ గౌరవాన్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు. .ప్రజలు చెల్లించే పన్నులను లూటీ చేస్తున్న వారికి రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ ఆహ్వానించడం, అతిథి మర్యాదలు చేయడం ఎంతమాత్రం సబబు కాదని హెచ్చరించారు. కార్యక్రమంలో పౌర సంఘం నాయకులు గౌరీష్‌, జ్యోతి, సుందరి, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు శివ పాల్గొన్నారు.