Aug 08,2022 23:09

సెమినార్‌కు వచ్చిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో కార్మిక సంఘాల నేతలు

ప్రజాశక్తి-ఉక్కునగరం : 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' నినాదంతో ఏర్పడిన స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాలని, ఉక్కు యాజమాన్యం, కేంద్రం కలిసి చేస్తున్న కుట్రలను సమైక్యంగా ప్రజల భాగస్వామ్యంతో ఎదుర్కొనాలని జాతీయ పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పిలుపునిచ్చారు. 'విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ- వ్యతిరేక విధానాలు' అంశంపై ఉక్కునగరం స్టీల్‌ క్లబ్‌లో సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌కు హరగోపాల్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ సంపదను ఇద్దరు, ముగ్గురు కార్పోరేట్లకు అప్పగించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. దేశ సంపద అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ది చేయడానికి ఉపయోగపడాలే కానీ ప్రయివేటు ఆర్ధిక శక్తులను బలపరచడానికి కాదన్నారు. పోస్కో వంటి కంపెనీలకు స్టీల్‌ ప్లాంట్‌ను అప్పగించాలని ప్రయత్నించడం సరికాదన్నారు. పరిశ్రమను కాపాడుకోవడానికి కార్మికవర్గం, ప్రజలు దీక్షలు చేయాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. దేశం మొత్తాన్ని ప్రయివేటీకరించి, సంపదను కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెడితే దేశ భవిష్యత్తు ఎటో పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పరిశ్రమలను విదేశీ కంపెనీలకు ఎందుకు అమ్మాలని ప్రశ్నించారు. దేశ సమైక్యతను, సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలనుకునే నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. యునైటెడ్‌ స్టీల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (యూస్‌) అధ్యక్షులు పరంధామయ్య మాట్లాడుతూ, ఏ ఉద్యమానికైనా ప్రజల భాగస్వామ్యం అవసరమని, దాని ద్వారానే ఎన్నో ఉద్యమాలు ఉన్నతిని సాధించాయని తెలిపారు. ఉక్కు ఉద్యోగులతోపాటు నిర్వాసితులు, ప్రజలు ఈ ఉధ్యమంలో భాగస్వామ్యం అయ్యిమోడీ వ్యతిరేక విధానాలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, వరసాల శ్రీనివాస్‌, మస్తానప్ప, సంపూర్ణం, బూసి వెంకటరావు యూస్‌ నాయకులు పాల్గొన్నారు.