ప్రజాశక్తి-పిట్టలవాని పాలెం: ఉగాది రోజున పిట్టలవానిపాలెం మండలం పసుపుమయంగా మారింది. బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ ప్రజల్లోకి వెళ్లటానికి ఉగాది పర్వదినాన్ని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకు అల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం కార్యకర్తలతో భారీ ర్యాలీగా కొత్తపాలెం పరిధిలోని అలుమర్లవారిపాలెం బయలుదేరారు. అక్కడ నుంచి ఇంటింటికీ తెలుగుదేశం, మీ మాట నా బాట కార్యక్రమం ప్రారంభించారు. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ ప్రతి ఇంటికీ తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా పని చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో గురువారం మండల పరిధిలోని కొత్తపాలెంలో కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి గడపను ఆప్యాయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ విధానాలు, బాపట్ల అభివృద్ధికి తన ఆలోచనలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఇంటింటికీ తెలుగుదేశం, మీ మాట-నా బాట కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలిపిన నారా చంద్రబాబు నాయుడు విజన్, పరిపాలన దక్షతను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కష్టానికి మారుపేరైన మహిళామణులను గౌరవిస్తూ వారికి చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకొనే సంచిని మరియు నా గురించి తెలియజేసే ఒక కరపత్రాన్ని అందించి వారి ఆశీర్వచనాలు అందుకుంటున్నట్టు నరేంద్రవర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శంకర్‌రెడ్డి, ముసలయ్య, యూనిట్ గ్లోరి, భూపతిరావు, బుల్లయ్య, వెంకట రామరాజు, మీరా, సైదా, అప్జల్ తదితరులు పాల్గొన్నారు.










