ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని నువ్వులరేవులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల ప్రవేశపెట్టిందని, అర్హులైన ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సహాయం నేరుగా అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలదే హవా అని వారి చుట్టూ కాళ్లరిగేలా తిరిగి వారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప పనులయ్యేవి కావన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా దేశంలోనే పారదర్శకమైన పాలనందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నాలుగేళ్లుగా తాను ఎంతో కృషి చేశానన్నారు. గతంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరిగిన అభివృద్ధికి తేడాలను ప్రజలు గమనించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైసిపి విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్‌పి వైస్ చైర్‌పర్సన్ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు, ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్, వైసిపి మండల అధ్యక్షులు పుక్కల గురయ్యనాయుడు, మందస ఎంపిపి డి.దానయ్య, సర్పంచ్ ఎజ్రా, ఉప సర్పంచ్ దేవా, కిడిసింగి సర్పంచ్ నర్తు లక్ష్మీనారాయణ, ఈరోతు హేమంత్, తహశీల్దార్ బి.అప్పలస్వామి, విఆర్‌ఒ హైమావతి, సచివాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.










