Jan 14,2023 00:01

మహిళలతో మాట్లాడుతున్న బూడి

ప్రజాశక్తి- దేవరాపల్లి
మండలంలోని ఎ.కొత్తపల్లి గ్రామంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మహిళలు కోలాటంతో మంత్రికి స్వాగతం పలికారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని రైతు చేత ప్రారంభింపజేశారు. రూ.17.50 లక్షలతో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో రూ.18.22 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. సుమారు కోటి రూపాయలతో 90 వేల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను స్వయంగా పరామర్శించారు. నూతనంగా మంజూరైన రేషన్‌ కార్డులను లభ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కర్రి సత్యం, వైస్‌ ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మీ, సర్పంచ్‌ చింతల వెంకటరమణ, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, వైపిపి మండల అధ్యక్షులు బూరె బాబురావు, నాయకులు రొంగలి నారాయణమ్మ పాల్గొన్నారు.
చోడవరం : చోడవరం పట్టణంలోని ఇందిరా కాలనీ, దుర్గ కాలనీ, ఎడ్ల వీధి తదితర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. మహిళలు తమకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు కాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందించి అర్హత ఉంటే తక్షణమే పథకాలు అందజేయాలని వెంటనే అధికారులను ఆదేశించారు. వాళ్ల వీధిలో ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక తహశీల్దార్‌ తిరుమల బాబుకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బైన ఈశ్వరరావు, వైసిపి నాయకులు ఓరుగంటి నెహ్రూ బాబు, నాగు, ప్రకాష్‌, చెన్నం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌.రాయవరం:రాష్ట్రప్రభుత్వం ప్రజలకు నేరుగా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటా అందాలని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. శుక్రవారం కొరుప్రోలు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలో పర్యటించారు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సిఎం జగన్మోహన్‌రెడ్డి పాటు పడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులై ఉండి సంక్షేమ పధకాలు అందని వారు వెంటనే సచివాలయంలో ధరఖాస్తు చేయాలని సూచించారు. ఆయన వెంట గ్రామ వైసిపి నాయకులు చేకూరి శ్రీరామచంద్రరాజు, పోలిశెట్టి పెదఈశ్వరరావు, నూకునాయుడు, కొర్ని రాజా రమేష్‌, మామిడి చంటి తదితరులు పాల్గొన్నారు.