Aug 15,2023 23:18

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రజా సంక్షేమం, సత్వరాభివద్ధి లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న ప్రాధాన్యతా పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి భాగస్వామ్యంతో జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర పశు సంవర్థక, డెయిరీ, మత్స్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం కాకినాడ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జిల్లాస్థాయి 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పరిపాలనను మరింత చేరువలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పిఎం కిసాన్‌ పథకాల ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో 1.74 లక్షల మంది రైతులకు రూ.131 కోట్ల సహాయాన్ని రైతుల ఖాతాలకు నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన 3,996 మంది రైతులకు రూ.3.23 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించినట్లు వెల్లడించారు. జగనన్న పాలవెల్లువ (అమూల్‌) కార్యక్రమం కింద జిల్లాలో 133 పాల శీతలీకరణ కేంద్రాలు, 171 పాల సేకరణ కేంద్రాలు నిర్మిస్తున్నామని తెలిపారు. మత్స్య ఉత్పత్తుల రంగంలో జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. ఈ ఏడాది 24 వేల 147 మెరైన్‌ మత్స్యకార కుటుంబాలకు రూ.24.15 కోట్లు వేట నిషేద సమయంలో పరిహారం అందించామన్నారు. 2022-23 రబీ సీజన్‌లో 84,161 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల సేకరించామన్నారు. రైజ్‌ కార్యక్రమం ద్వారా 8,450 మంది విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలలో ప్రత్యేక శిక్షణ కల్పించామన్నారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెరేడ్‌ మైదానంలో వివిధ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అన్నవరం దేవస్థానం, జిల్లా గ్రామీణాభివద్థి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పౌర సరఫరాలు, విద్యా శాఖ, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, పశుసంవర్థక శాఖ -జగనన్న పాల వెల్లువ, గ్రామీణ నీటి సరఫరా, ఆరోగ్యశ్రీ-104, 108, తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు, అగ్నిమాపక, విపత్తు స్పందన వివిధ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. వీటిలో జిల్లా విద్యాశాఖ శకటానికి మొదటి, పౌర సరఫరాల శాఖ శకటానికి ద్వితీయ, పశుసంవర్థక శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.